ETV Bharat / city

Jaggareddy Letter: ఇక నుంచి కాంగ్రెస్​ పార్టీ గుంపులో లేను: జగ్గారెడ్డి

author img

By

Published : Feb 19, 2022, 4:34 PM IST

Updated : Feb 19, 2022, 7:05 PM IST

Jaggareddy
Jaggareddy

Jaggareddy Clarity on Resignation: ఇకనుంచి తాను కాంగ్రెస్‌ పార్టీ గుంపులో లేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వేరే పార్టీలో వాళ్లు ఆహ్వానించినా తాను వెళ్లడం లేదని.. అమ్ముడు పోయాననే మచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Jaggareddy Clarity on Resignation: కాంగ్రెస్​కు రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి!

Jaggareddy Letter: ఇకనుంచి తాను కాంగ్రెస్‌ పార్టీ గుంపులో లేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఏకరవు పెడుతూ సోనియా, రాహుల్‌గాంధీ, పార్టీ ఇన్‌ఛార్జీలు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. తెరాస కోవర్టుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. లేఖలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రం ఇప్పించిన కాంగ్రెస్‌ నుంచి ఎంతోమంది బయకు వెళ్లారని.. సడెన్‌గా లాబీయింగ్‌ చేస్తే ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు కావచ్చనే అంశాలను ప్రస్తావించారు.

వేరే పార్టీలో వాళ్లు ఆహ్వానించినా తాను వెళ్లడం లేదని.. అమ్ముడు పోయాననే మచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు మాట్లాడితే యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా కోవర్ట్‌ అని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు చేస్తున్నప్పుడూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెబితే తెలంగాణ ద్రోహి అన్నారని గుర్తుచేశారు. రాజకీయాల్లో మర్యాదలు, వ్యూహాలు తదితర అంశాలను సోనియాగాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన జగ్గారెడ్డి.. మహాభారతంలో బీష్ముడు, పాండవుల అంశాన్నీ ప్రస్తావించారు.

త్వరలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీకి రాజీనామా చేసి సోనియా, రాహుల్‌గాంధీకి లేఖ పంపిస్తానని జగ్గారెడ్డి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు జగ్గారెడ్డిని వి.హనుమంతరావుతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్‌ కలిశారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్లవద్దని సూచించారు. బొల్లి కిషన్‌... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని మరీ బతిమాలారు. కాంగ్రెస్‌కు దూరం కావద్దని.. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడదామని సూచించారు. తననూ కోవర్టంటూ సాగిస్తున్న ప్రచారాన్ని ఖండించిన వీహెచ్​.. జూబ్లీహిల్స్‌ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాపై జగ్గారెడ్డి క్లారిటీ
Jaggareddy Clarity on Resignation: టీకప్పులో తుఫాన్‌లా జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం ముగిసింది. కాంగ్రెస్‌కు రాజీనామా నిర్ణయం నుంచి జగ్గారెడ్డి వెనక్కి తగ్గారు. పార్టీకి రాజీనామా చేయ‌డం లేద‌ని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాజీనామా చేయ‌వ‌ద్దని కోరింద‌ని.. ఇందువ‌ల్ల చేయ‌డం లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

ఏ పార్టీలోకీ వెళ్లను..
జ‌గ్గారెడ్డి పార్టీకి దూర‌మ‌వుతార‌ని, రాజీనామా చేస్తార‌ని మీడియాలో ప్రచారం జ‌రగడంతో ఉద‌య‌మే పార్టీ అధిష్టానంతోపాటు సీనియ‌ర్లు రంగ‌ప్రవేశం చేశారు. ఆయ‌న‌ను మెత్తబ‌రిచేందుకు ప్రయ‌త్నించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హ‌నుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యద‌ర్శి బొల్లు కిష‌న్‌లు జ‌గ్గారెడ్డి ఇంటికి వెళ్లి పార్టీ నుంచి దూరం కావ‌ద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడదామని సూచించారు. సామాజిక మాద్యమాల ద్వారా త‌న‌పై లేనిపోని దుష్ప్రచారం జ‌రుగుతోందని జ‌గ్గారెడ్డి ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న వ్యక్తం చేశారు. పార్టీ కోసం క‌ష్టప‌డి ప‌ని చేస్తుంటే తెరాస కోవ‌ర్టు ముద్ర వేస్తుండ‌డంతో త‌న‌కు బాధ‌గా ఉంద‌ని, త‌న‌వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌ని భావిస్తే తాను పార్టీకి దూరంగా ఉంటాన‌ని ఏ పార్టీలోకి వెళ్లన‌ని జ‌గ్గారెడ్డి వివ‌రించారు. త‌న ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి తెరాస‌లో చేరుతున్నట్లు ఇబ్బందిక‌ర‌మైన తంబ్‌నెయిల్స్ పెడుతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

పార్టీ వీడొద్దని కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్​ నేత
ఇదే సమ‌యంలో వీహెచ్‌తోపాటు ఉన్న పీసీసీ ప్రధాన కార్యద‌ర్శి బొల్లు కిష‌న్ జ‌గ్గారెడ్డి కాళ్లపై ప‌డి.. పార్టీకి రాజీనామా చేయ‌వ‌ద్దని, పార్టీకి దూరం కావ‌ద్దని విజ్ఞప్తి చేశారు. అధిష్ఠానం విజ్ఞప్తి మేర‌కు తాను పార్టీకి రాజీనామా చేయ‌డం లేద‌ని, పార్టీలో త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయాలు, అవ‌మానాల గురించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు జ‌గ్గారెడ్డి చెప్పారు. లేఖ సిద్దమ‌వుతుంద‌ని సోనియాగాంధీకి, ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవ‌హారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​ల‌కు కూడా పంపుతాన‌ని ఆయ‌న వివ‌రించారు. త‌న‌వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌ని కొంద‌రు నాయ‌కులు త‌న‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇందువ‌ల్ల పార్టీకి దూరంగా ఉంటాన‌ని లేఖ‌లో పేర్కొన‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల త‌రువాత లేఖ ప్రతిని విడుద‌ల చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు.

దుష్ప్రచారం జరుగుతోంది..
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వీహెచ్‌ మండిపడ్డారు. తనతో పాటు జగ్గారెడ్డిని ప్రస్తావిస్తూ తెరాసకు అనుకూలంగా పనిచేస్తున్నామని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

"పార్టీలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నా గురించి చెడుగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ప్రస్తుతానికైతే పార్టీకి రాజీనామా చేయను. పార్టీని వీడొద్దని అధిష్ఠానం కోరింది. అధిష్ఠానం కోరిక మేరకు.. కార్యకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను." - జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

ఇదీ చదవండి:

33 నెలల్లో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు - దేవినేని

Last Updated :Feb 19, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.