ETV Bharat / city

Medical Colleges: రేపే తెలంగాణలో వైద్యకళాశాలలు పునఃప్రారంభం.. ఆన్‌లైన్‌లోనే పాఠాలు!

author img

By

Published : Jul 28, 2021, 9:21 AM IST

వైద్య విద్యలో తరగతి పాఠాలతో పాటు అనుభవపూర్వక (క్లినికల్‌), ప్రయోగశాల శిక్షణ కీలకం. అందుకే కొవిడ్​ రెండో ఉద్ధృతి తగ్గడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. కరోనా మూడోదశ ఉద్ధృతి ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా వైద్య కళాశాలలను తిరిగి ప్రారంభించడం మంచిదనే భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి

medical collages start
తెలంగాణలో వైద్యకళాశాలలు పునఃప్రారంభం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు రేపు పునఃప్రారంభం కానున్నాయి. దంత, నర్సింగ్‌, ఫిజియోథెరపీ తదితర కళాశాలలనూ గురువారం నుంచి తిరిగి తెరుస్తారు. వచ్చే నెల 1 నుంచి వైద్యకళాశాలల ప్రారంభానికి అనుమతులు కోరుతూ కాళోజీ ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన అనంతరం నిర్ణయాన్ని మార్చుకొని మూడు రోజుల ముందుగానే కళాశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తరగతులకు హాజరైతేనే.. ఆసుపత్రుల్లో రోగులను పరీక్షించడానికి అవకాశం కలుగుతుంది. ఇంట్లోంచి ఆన్‌లైన్‌ తరగతులు ఎంత విన్నా.. అనుభవపూర్వకంగా నేర్చుకునే దానితో సమానం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో వైద్య తరగతుల పునఃప్రారంభానికి ఇదే మంచి తరుణమని వర్సిటీ వర్గాలు ఆలోచించాయి.

అనుభవపూర్వక శిక్షణ..

ఎప్పుడు కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతి మొదలవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా వైద్య కళాశాలలను తిరిగి ప్రారంభించడం మంచిదనే భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. తొలుత కేవలం తుది సంవత్సరం విద్యార్థులను మాత్రమే ప్రాక్టికల్స్‌, క్లినికల్‌ శిక్షణకు అనుమతించాలని భావించినా.. ఈ నిర్ణయంలోనూ మార్పు చేసింది. గురువారం నుంచి అన్ని సంవత్సరాల వైద్య, దంత, నర్సింగ్‌, ఫిజియోథెరపీ విద్యార్థులు అనుభవపూర్వక శిక్షణకు హాజరు కావాలని వర్సిటీ ఆదేశాలు జారీ చేసింది.

మార్గదర్శకాల్లో కొన్ని..

  • ఇప్పటికే వైద్య విద్యార్థుల్లో సుమారు 60% మందికి కొవిడ్‌ టీకాలను వేశారు. మిగిలిన విద్యార్థులకు ఇవ్వడాన్ని ప్రాధాన్య అంశంగా పరిగణనలోకి తీసుకోవాలి.
  • థియరీ తరగతులు ఇప్పటి మాదిరిగానే ఆన్‌లైన్‌లో కొనసాగుతాయి.
  • ప్రాక్టికల్స్‌, క్లినికల్‌ తరగతులకు అందరు విద్యార్థులు ఒకేసారి హాజరు కాకుండా.. బ్యాచ్‌లుగా విభజిస్తారు.
  • తరగతిలోని సగం మంది విద్యార్థులకు 15 రోజులు.. మిగిలిన సగం మందికి మరో 15 రోజుల చొప్పున నెలలో విభజించి అనుభవపూర్వక శిక్షణ ఇవ్వాలి.
  • 15 రోజుల పాటు వసతిగృహాల్లో ఉంటూ.. తర్వాత 15 రోజులు ఇళ్ల వద్ద ఉంటూ అభ్యసించాల్సి ఉంటుంది.
  • విద్యార్థులకు పార్సిల్‌ పద్ధతిలో భోజనాలను అందించే విధానాన్ని పరిశీలించాల్సిందిగా కళాశాలలకు కాళోజీ వర్సిటీ సూచించింది.
  • విద్యార్థుల్లో ఒకవేళ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారిని విడిగా వేరే గదిలో ఉంచి చికిత్స అందించాలి.
  • అన్ని తరగతుల విద్యార్థులు కూడా అనుభవపూర్వక శిక్షణకు తగిన ప్రాధాన్యమిచ్చి విలువైన సమయాన్ని వినియోగించుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.కరుణాకర్‌రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి:

Flash: మాజీ మంత్రి దేవినేని వర్గీయులపై రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.