రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,04,90,497 (సర్వీసు ఓటర్లతో కలిపి)కు చేరింది. వారిలో పురుషులకంటే మహిళలు 5,12,998 మంది ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022 ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.
కడప జిల్లా బద్వేలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వివరాల్ని ఈ ముసాయిదా జాబితాలో పొందుపరిచింది. దాని ప్రకారం రాష్ట్రంలో సాధారణ ఓటర్లు 4,04,23,407 మంది కాగా.. సర్వీసు ఓటర్లు 67,090 మంది. ఈ ముసాయిదా జాబితాపై ఈ నెల 30 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. వాటన్నింటినీ పరిష్కరించాక 2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వినతుల స్వీకరణ కోసం ఈ నెల 20, 21 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లోను శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. 2022 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత నవంబరు30 వరకూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.
* అత్యధిక ఓటర్లున్న జిల్లాల జాబితాలో తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా ఉన్నాయి.
* అతి తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో విజయనగరం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు నిలిచాయి.
* శ్రీకాకుళం, అనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషులకంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
* రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 17,336 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా నెల్లూరులో 721 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.
* రాష్ట్రంలో మొత్తం 67,090 సర్వీసు ఓటర్లు ఉండగా.. వారిలో 64,891 మంది పురుషులు. 2,199 మంది మహిళలు.
ఇదీ చదవండి : Mahapadayathra: రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు..