ETV Bharat / city

TELANGANA: కొత్త రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలుకు సర్వం సిద్ధం

author img

By

Published : Jan 31, 2022, 8:24 AM IST

కొత్త రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలుకు సర్వం సిద్ధం
కొత్త రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలుకు సర్వం సిద్ధం

New Registration Values:తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్‌ విలువల అమలుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లాల్లో విలువల పెంపు కమిటీల ఆమోదం పూర్తి కావడంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఎన్​ఐసీ సహకారంతో వాటిని సాప్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేయనుంది.

New Registration Values: తెలంగాణలో పెంచిన రిజిస్ట్రేషన్ విలువలను రేపటి నుంచి అమలు చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ సన్నద్ధమైంది. మూడు వారాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖకు విలువల పెంపునకు మౌఖికంగా అనుమతి ఇచ్చింది. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్​మెంట్లు.. ఇలా మూడు విభాగాల్లో వరుసగా 50 శాతం, 35 శాతం, 25 శాతం లెక్కన పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో... అక్కడి బహిరంగ మార్కెట్‌ విలువల ఆధారంగా ఇంతకంటే ఎక్కువ పెంచేందుకు తగిన కసరత్తు చేయాలని మౌఖికంగా ఆదేశించింది.

విలువల పెంపుపై కసరత్తు

సంయుక్త ఐజీ శ్రీనివాస్‌, అదనపు ఐజీ రాజేశ్‌, సహాయ ఐజీలు సంతోష్‌రెడ్డి, సుభాషిణిలతోపాటు మరో నలుగురు డీఐజీలు కలిసి బృందంగా ఏర్పడి.. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి విలువల పెంపుపై కసరత్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రాంతాలవారీగా జరిగిన రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్‌ విలువలను నిశితంగా పరిశీలించి... ఆయా ప్రాంతాల్లో చలామణి అవుతున్నబహిరంగ మార్కెట్‌ విలువలను తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ అధిక విలువలకు రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి... అక్కడ పెంచేందుకు ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలించారు. లోతైన అధ్యయనం అనంతరం.. ఏయే ప్రాంతంలో ఎంతెంత పెంచాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు అధికారుల బృందం తుది నిర్ణయం తీసుకుంది.

విలువల పెంపు కమిటీలు ఆమోదముద్ర

అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల విలువలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరిగినట్లు అధికారుల బృందం గుర్తించింది. 600 గ్రామాల్లో వ్యవసాయ భూములు, 6 వేలకు పైగా ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ శాతాలు పెంచింది. వ్యవసాయ భూములపై గరిష్ఠంగా 150 శాతం, ఖాళీ స్థలాలపై గరిష్ఠంగా 60 శాతం పెంచింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని విలువల పెంపు కమిటీలు ఆమోదముద్ర వేశాయి. అందుకు సంబంధించిన పత్రాలు హైదరాబాద్‌ ఐజీ కార్యాలయానికి ఆదివారం సాయంత్రానికి అందాయి. సర్వం సిద్ధం చేసుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కొత్త విలువల అమలకు ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తోంది.

అప్​డేట్​ చేసేందుకు సిద్ధం
ఆదేశాలు అందిన వెంటనే రిజిస్ట్రేషన్‌ శాఖ కాడ్‌ సాప్ట్‌వేర్‌లో, రెవెన్యూ శాఖ ధరణి పోర్టల్‌లో వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.