ETV Bharat / city

Physically challenged people: సంకల్పం ముందు.. చిన్నబోయిన వైకల్యం!

author img

By

Published : Dec 3, 2021, 6:45 PM IST

Physically challenged people: "అన్ని అవయవాలు సజావుగా ఉన్నవాళ్లే.. ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా మనమేం చేస్తాంలే" అని వారు అనుకోలేదు. అలా అనుకుంటే ఈరోజు వారి జీవితాల్లో మార్పు వచ్చేది కాదు. సాధారణంగా అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నవారే చిన్న చిన్న సమస్యలకు కుంగిపోతుండటం మనం చూస్తుంటాం. కొందరైతే వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. కానీ.. తమకున్న వైకల్యాన్ని జయించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ.. ఎంతో మంది దివ్యాంగులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం(World Diverse Talent Day) సందర్భంగా అలాంటి వారిపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం...

అంగవైకల్యం దినోత్సవం
Physically challenged people

physically challenged people success: ఎన్నో అవహేళనలు.. ఇంకెన్నో అవమానాలు.. అవన్నీ దాటితేనే అద్భుతమైన విజయాలు సాధించగలమని నిరూపించారు. సాధారణ వ్యక్తులకు తామేమీ తీసిపోమని సత్తా చాటారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన మరుగుజ్జు. బంజారాహిల్స్​లోని గౌరీశంకర్‌ కాలనీలో నివసించే జి.శివలాల్‌ (39). మరుగుజ్జు అయినా ఆత్మస్థైర్యంతో జీవితంలో అడుగులు ముందుకేస్తూ అందరిచేతా ‘ఔరా’ అనిపించారు. శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించిన తొలి మరుగుజ్జుగా రికార్డు సృష్టించారు.

చాలామంది హేళన చేసినా పట్టించుకోలేదు
Sivalal got driving licence: సైకిల్‌ కూడా తొక్కలేవని చుట్టుపక్కల ఉన్నవారు చేసిన అవహేళనల నుంచే తనలో డ్రైవింగ్‌ నేర్చుకోవాలనే పట్టుదల పెరిగేలా చేసిందంటున్నారు శివలాల్‌. శరీరాకృతి డ్రైవింగ్‌కు అనువుగా లేకపోవడంతో.. ఏ డ్రైవింగ్‌ స్కూల్‌లో అడుగుపెట్టినా శిక్షణ ఇవ్వలేమని మొహం మీదే చెప్పారు. దీంతో కారు రీమోడలింగ్‌ చేసుకుంటే డ్రైవింగ్‌ నేర్చుకోవచ్చని తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు సాగించారు. రీమోడల్‌ చేసిన కారులో తొలుత ప్రయత్నం చేసి డ్రైవింగ్‌ చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు.

కారు కొనుక్కుని మరీ..
sivalal owned a car: అనంతరం గతేడాది నవంబర్‌ 27న సొంతంగా కారు కొనుక్కున్నారు. క్లచ్‌, బ్రేక్‌ తనకు అందేలా మార్పులు చేయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్‌ చేయడం నేర్చుకున్నారు. మొదలుపెట్టిన రెండు నెలల్లోనే పూర్తి నైపుణ్యాన్ని సంపాదించారు. అనంతరం లెర్నింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల అనంతరం ఆగస్టు 6న శాశ్వత లైస్సెన్స్‌ జారీ అయ్యింది. చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బతుకు బండిని లాగుతున్న శివలాల్‌ భార్య చిన్మయి కూడా మరుగుజ్జే. వీరికి ఒక కుమారుడు హితేశ్‌.

ఒంటి కాలుతో ఏం చేస్తావన్నారు..
success as athlet: ఫార్మా ఉద్యోగిగా, సాఫీగా సాగుతున్న ఆయన జీవితంలో విద్యుత్తు ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. ఎడమకాలు కోల్పోయారు. ఒంటికాలితో ఏం చేస్తాం..? జీవితం ఇక ముగిసినట్టేనా? అని అనుకోలేదు. 2006లో విద్యుత్‌ ప్రమాదం జరగ్గా.. అప్పటి నుంచి కఠోర సాధన చేసి సైక్లింగ్‌, మారథాన్‌, క్లైంబింగ్‌లో సత్తా చాటుతున్నారు. 2014లో ఎయిర్‌టెల్‌ మారథాన్‌ పూర్తి చేశారు. 200 కి.మీ సైక్లింగ్‌ చేశారు. 10కి.మీ పరుగుపందెంలో పాల్గొన్నారు.

లద్దాఖ్‌ నుంచి కన్యాకుమారి సోలో సైక్లింగ్‌ను 48 రోజుల్లో 4100 కి.మీ పూర్తి చేశారు. 2018లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించారు. యూరప్‌లో అత్యంత ఎత్తైన పర్వతశిఖరం మౌంట్‌ ఎల్బ్రస్‌ను 2019లో అధిరోహించారు. 2019లో ఆఫ్రికాలో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ కిలిమంజారోను అధిరోహించారు. ఆస్ట్రేలియాలో మౌంట్‌ కోస్కియూస్కోను 2020లో అధిరోహించారు. 2022 జనవరిలో లద్దాఖ్‌లోని 6070 మీటర్ల ఎత్తైన యూటీకాంగ్రీ శిఖరం అధిరోహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.