ETV Bharat / city

రాష్ట్రంలో అత్యాచార ఘటనలు.. హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి : పవన్

author img

By

Published : May 6, 2022, 6:50 PM IST

Pawan Kalyan : రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ గురించి పాలకులు అస్సలు పట్టించుకోవడం లేదని, అత్యాచారాల కట్టడికి పోలీసు ఉన్నతాధికారులే శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. అత్యాచార ఘటనలు ఇలాగే కొనసాగితే.. హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదన్న పవన్.. సమాజంలో మహిళలు ధైర్యంగా తిరిగే పరిస్థితి కల్పించాలన్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై... జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు విఫలమైనందున పోలీసు ఉన్నతాధికారులే వాటిని కట్టడి చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుండటం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. అభంశుభం తెలియని పసివాళ్లపైనా, గర్భిణులపై, మానసిక పరిణతిలేనివారిపై, విద్యార్థినులపై, యువతులపై వరుసగా అత్యాచారాలు జరగటం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు.

హైకోర్టు సుమోటోగా తీసుకుని: రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఆగకపోతే.. హైకోర్టు సుమోటోగా తీసుకుని, మహిళల రక్షణకై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. వైకాపా ప్రభుత్వం ఎలాగూ ఆడబిడ్డలను కాపాడలేదు కావునా ... తమ బిడ్డల్ని మృగాళ్ల బారినపడకుండా తల్లితండ్రులే కంటికి రెప్పలా కాపాడుకోవాలని కోరారు.

ఆ ఘటనలు మనసులు కలచివేశాయి: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన గురించి తెలిసి మనసు వికలమైందని పవన్ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించి... వారు ధైర్యంగా తిరిగే పరిస్థితులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని తాము నిందించడం లేదని.. సూచన మాత్రమే చేసున్నట్లు స్పష్టం చేశారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని చట్టం చెబుతున్నా.. పాలకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాధ్యత గల హోదాల్లో ఉన్నవారే తల్లితండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి పాలకులను విశ్వసించలేమని... అందుకే బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యాచారాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని సీఎం జగన్​ సమీక్ష చేయకపోవటాన్ని జనసేన అధినేత తప్పుపట్టారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం.. మృతదేహం తరలింపునకు 108 నిరాకరణ.. బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.