ETV Bharat / city

ఉల్లి ధర పతనం.. అదే కారణమా!

author img

By

Published : May 2, 2022, 5:10 AM IST

రాష్ట్రంలో ఉల్లి ధర భారీగా తగ్గిపోయింది. గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు, రైతులు అంటున్నారు. దేశంలో ఉల్లి ఎక్కువగా పండించే 8 రాష్ట్రాల్లో పంట పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Onion
Onion

ఉల్లి ధర భారీగా పతనమైంది. నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లి కిలో రూ.16 ఉండగా.. రెండో రకం పంటను కొనేవారు కరవయ్యారు. గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు, రైతులు అంటున్నారు. దేశంలో ఉల్లి ఎక్కువగా పండించే 8 రాష్ట్రాల్లో పంట పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏటా వేసవిలో రాష్ట్రంలో ఉల్లికి మంచి డిమాండు ఉండేది. గతేడాది ఇదే నెలలో కిలో ధర రూ.25 ఉండగా.. ఈసారి రూ.16 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ తాడేపల్లిగూడెం. ఇక్కడి చిల్లర దుకాణాల్లో నాణ్యమైన సరకు కిలో రూ.16కే లభ్యమవుతోంది. హోల్‌సేల్‌గా క్వింటాల్‌ ధర రూ.1200 నుంచి రూ.1400.

భారీగా పెరిగిన ఉత్పత్తి.. దేశంలో పెద్ద ఎత్తున పండించే మహారాష్ట్రలో ఈ సంవత్సరం 50 వేల ఎకరాల్లో అదనంగా సాగు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు దిగుబడులు భారీగా వచ్చాయి. మన దేశం నుంచి ఎప్పుడూ దిగుమతి చేసుకునే బంగ్లాదేశ్‌లోనూ ఈ ఏడాది ఉల్లిని పండించారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ పంట పండిస్తున్నారు. ఒక్కసారిగా పంట అందుబాటులోకి రావడంతో డిమాండ్‌కు మించి సరఫరా ఉంది. రాష్ట్రంలోని కర్నూలులో రెండో పంట కూడా వచ్చింది. దీంతో ధర పతనమైంది.

తగ్గిన వ్యాపారం.. తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ వ్యాపారులు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటుంటారు. ధర లేకపోవడంతో నష్టపోయే అవకాశం ఉందని దిగుమతులను తగ్గించారు. ఎప్పుడూ ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడే ఇక్కడి బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ బోసిపోయింది. ఈ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 10 లారీల ఉల్లి దిగుమతయ్యేది. సీజన్‌ ప్రారంభం, ముగింపు దశల్లో 50 లారీలు, సీజన్‌లో 100 నుంచి 200 లారీల వరకు సరకు వచ్చేది. కిసాన్‌ రైలును వినియోగించుకుని వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో పంట అందుబాటులోకి రావడంతో ధర లేక వ్యాపారం మందగించింది.

ఇదీ చదవండి: కర్రలు, బీరు సీసాలే ఆయుధాలు.. రోడ్డున పడి తన్నుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.