ETV Bharat / city

రాజధానిలో 'రహస్యం' ఏముంది..?

author img

By

Published : Sep 21, 2020, 7:03 AM IST

Updated : Sep 21, 2020, 7:42 AM IST

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ప్రభుత్వ అభియోగాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో... ప్రభుత్వ వర్గాలు బహిరంగంగా ప్రకటించిన తర్వాత జరిగిన కొనుగోళ్లను తప్పుబట్టడంపై న్యాయవాద వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వాదనలో ఏమాత్రం సహేతుకత లేదని.. కక్షసాధింపులా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి.

No Secret in Capital City Lands
రాజధానిలో 'రహస్యం' ఏముంది..?

రాజధానిలో 'రహస్యం' ఏముంది..?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై అభియోగాలు మోపడానికి ఉన్న ప్రాతిపదికపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ఎక్కడ వస్తుందో గత ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులకు ప్రాధమిక దశలోనే తెలుసు కాబట్టి, వారు...వారితో సంబంధమున్న వ్యక్తులు ముందుగానే తక్కువ ధరకు భూములు కొన్నారనేది ఆ అభియోగాల సారాంశం. రాజధాని ఎక్కడ రానుందో ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు బహిరంగంగా ప్రకటించిన తర్వాత జరిగిన కొనుగోళ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం అక్రమాల పరిధిలోకి తీసుకురావడం ఆశ్చర్యకరంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానికి కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు 2014 జులై 22న రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్‌, అప్పటి మంత్రి డాక్టర్‌ పి.నారాయణ దిల్లీలో తెలిపారు. ఈ విషయాన్ని అదే రోజు కేంద్రం రాజధానిపై ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులకు చెప్పారు. ఈ అంశాలు మరుసటి రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. విజయవాడ-గుంటూరు మధ్య రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం 2014 సెప్టెంబరు 1న నిర్ణయించింది.

శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా ప్రసార సాధనాలు ప్రముఖంగా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించాయి. మూడురోజుల తర్వాత నాలుగో తేదీన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి జరిగిన స్థల ఎంపికపై అధికారికంగా ప్రకటన చేశారు. వివిధ అధ్యయనాల అనంతరం అమరావతి వద్దనే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని పెట్టబోతున్నట్లు చాలా ముందుగా జులై2నే జాతీయ, స్థానిక పత్రికలూ ప్రముఖంగా ఇచ్చాయి.

ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు వస్తుందనే అనధికార సమాచారం పత్రికల్లో వస్తే దాన్ని బట్టి కూడా డబ్బున్నవారు ఆ ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టడం సర్వసాధారణం. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని వ్యవహారాలు చూసే మంత్రి స్పష్టంగా సంకేతాలు ఇచ్చాక, ఫలానాచోట రాజధానిని పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాక జరిగిన క్రయవిక్రయాలనూ అక్రమంగా చూడటం ఎలా సమంజసమనే అభిప్రాయం పరిశీలకుల్లో కలుగుతోంది. ముఖ్యమంత్రి రాజధానిపై అధికారిక ప్రకటన చేశాక రెవెన్యూ అధికారులు సెప్టెంబరు రెండోవారం నుంచి భూముల పరిశీలనకు గ్రామాలకు వెళ్లారు. ఇక ఈ విషయంలో రహస్యం అనే మాటకు ఆస్కారం ఏముంది? ఆ పరిణామాల తర్వాత కొన్ని భూములు కొనుగోలు చేసిన వారిపైనా ప్రస్తుతం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే అభియోగం మోపారు.

డిసెంబరు వరకూ క్రయవిక్రయాలు పరిగణన...

రాజధానిలో అక్రమాలు జరిగాయనే సమాచారంపై పరిశీలనకు ప్రస్తుత ప్రభుత్వం 2019 జూన్‌లో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. రాజధాని నగరం, ప్రాంతం కింద ప్రకటించిన ప్రాంతాలలో 2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబరు 31 వరకూ జరిగిన భూముల క్రయవిక్రయాలను అది పరిగణనలోకి తీసుకుంది. వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా సమాచారం తెలిసినవారు 4069 ఎకరాలను కొన్నారని ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది.

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్‌, చందర్లపాడు మండలాల్లో వీటికి సంబంధించిన క్రయవిక్రయాలు జరిగాయని పేర్కొంది. రాజధాని నోటిఫికేషన్‌కు ముందే ఈ భూములను తక్కువ ధరకు కొన్నారని పేర్కొంటూ ఇదంతా ఒక అక్రమ వ్యవహారం అన్నట్లుగా విశ్లేషించింది. నోటిఫికేషన్‌ అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ. రాజధాని ఫలానా చోట అని మంత్రివర్గం తీర్మానం చేసి, ముఖ్యమంత్రి అధికారికంగా శాసనసభలో ప్రకటించడంకంటే ప్రజలకు కావాల్సిన స్పష్టత ఇంకేముంటుంది..?

ఫలానా చోట రాజధాని అని స్వయంగా ముఖ్యమంత్రి శాసనసభలో 2014 సెప్టెంబరు 4న ప్రకటించాక... అదే ఏడాది డిసెంబరు 31 వరకూ జరిగిన కొనుగోళ్లను కూడా ‘రహస్యంగా ప్రభుత్వ పెద్దల ద్వారా ముందుగానే సమాచారం తెలుసుకుని’ జరిపిన కొనుగోళ్ల కింద పరిగణించడంలో ఏమాత్రం సహేతుకత లేదని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజధాని ప్రాంతం అంతా గుంటూరు జిల్లా పరిధిలోకే వస్తుంది. ఇప్పుడు దూరంగా కృష్ణా జిల్లా పరిధిలో భూములు కొనుక్కున్నవారిపైనా, 2015లో భూములు కొనుక్కున్నవారిపైనా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు చేయడం కక్షసాధింపులా కనిపిస్తోందని అవి విశ్లేషిస్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం అక్రమ వ్యవహారాలుగా పేర్కొన్న 4069 ఎకరాల భూముల క్రయవిక్రయాల్లో 1790 ఎకరాలు కృష్ణా జిల్లా పరిధిలోనివి కావడం గమనార్హం.

Last Updated : Sep 21, 2020, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.