ETV Bharat / city

NDB Loan Funds: ఎన్‌డీబీ రుణం వచ్చినా.. బిల్లుల చెల్లింపుల్లేవు.. మరి రూ.230 కోట్లు ఏమయ్యాయో?..

author img

By

Published : Jul 24, 2022, 6:46 AM IST

NDB Loan Funds: అది విదేశీ బ్యాంకు కావడంతో రహదారుల విస్తరణ పనులు చేపట్టాక.. సకాలంలో బిల్లులు చెల్లిస్తారా అనే అనుమానం గుత్తేదారుల్లో ఉండేది. అయితే ఆ బ్యాంకు నుంచి చెల్లింపులకు ఢోకా ఉండదని అధికారులు, ఇంజినీర్లు అభయమిస్తూ వచ్చారు. అది నమ్మి కొన్ని జిల్లాల్లో పనులు చేశారు. అయితే బిల్లుల కోసం వాటిని అప్​లోడ్​ చేశారు కానీ.. నెలలు గడిచిపోతున్నాసరే అధికారులు చెల్లింపుల ఊసెత్తడం లేదు. దీంతో తాము సందేహపడిందే నిజమైందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

roads
roads

అది రాష్ట్రంలోని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో చేపట్టిన రహదారుల విస్తరణ ప్రాజెక్టు. పనులు చేశాక సకాలంలో బిల్లులు చెల్లిస్తారా? అనే సందేహం గుత్తేదారుల్లో ఉండేది. విదేశీ బ్యాంకు రుణంతో చేపడుతున్నందున చెల్లింపులకు ఢోకా ఉండదని అధికారులు, ఇంజినీర్లు అభయమిస్తూ వచ్చారు. కొన్ని జిల్లాల్లో గుత్తేదారులు కొంతమేర పనులు చేశారు. వాటి బిల్లులను అప్‌లోడ్‌ చేశారు. రోజులు గడిచిపోతున్నాసరే అధికారులు చెల్లింపుల ఊసెత్తడం లేదు. దీంతో తాము సందేహపడిందే నిజమైందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే పనులు చేయలేమని తెగేసి చెబుతున్నారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం రుణంలో రూ.230 కోట్లను మే చివరి వారంలో ఎన్‌డీబీ విడుదల చేసింది. అవి రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరాయి. వాటిని ఆర్‌అండ్‌బీకి ఇవ్వడం లేదు. ఇప్పటివరకు గుత్తేదారులు రూ.84.30 కోట్ల పనులు చేశారు. ఇందులో వివిధ జిల్లాల నుంచి రూ.39 కోట్ల మేర బిల్లులు అప్‌లోడ్‌ చేసి అయిదారు నెలలు అవుతోంది. మరో రూ.45 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి.. అందులోకి నిధులు జమ చేసి.. వాటిద్వారా చెల్లింపులు జరుపుతామంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని ఆర్థిక వ్యవహారాలశాఖకు (డీఈఏ) చెప్పింది. ఇప్పటివరకు అటువంటిదేమీ లేకుండా ప్రభుత్వం నిధులు వాడేసుకుందని గుత్తేదారులు పేర్కొంటున్నారు.

ముందుకు సాగని ప్రాజెక్టు
మండల కేంద్రాల మధ్య అనుసంధానం, వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానం కోసం 2,600 కి.మీ. రహదారుల విస్తరణకు రూ.6,400 కోట్లతో ఎన్‌డీబీ ప్రాజెక్టు మంజూరైంది. ఇందులో బ్యాంకు రుణం రూ.4,800 కోట్లు (70 శాతం), రాష్ట్ర వాటా రూ.1,920 కోట్లు (30) శాతంగా ఉంది. తొలివిడత 1,243 కి.మీ. విస్తరణ, 206 వంతెనల పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు రూ.1,855.71 కోట్ల సివిల్‌ పనులను అప్పగించారు. నాలుగైదు జిల్లాల్లో కొంత మేర పనులు మినహా వీటిలో ప్రగతి లేదు. మొత్తంగా రూ.84.30 కోట్ల మేర (4.54 శాతం) పనులే జరిగాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్క శాతం కూడా జరగలేదంటే ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.



ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.