ETV Bharat / city

పార్టీల విస్తృత ప్రచారంతో.. 'రణగోడు'ను తలపిస్తున మునుగోడు ఉపఎన్నిక

author img

By

Published : Oct 11, 2022, 10:34 AM IST

Munugode By Election: రాజకీయ పార్టీల విమర్శలు - ప్రతివిమర్శలు, సవాళ్లు - ప్రతిసవాళ్లతో మునుగోడు ఉపఎన్నిక పోరు వేడెక్కుతోంది. నామినేషన్ల వేళ భారీ ర్యాలీలు... ఊరూర విస్తృత ప్రచారాలు, చేరికలు, ప్రజాకర్షక ప్రసంగాలతో నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉపఎన్నికలో పైచేయి సాధించేందుకు తమదైన వ్యూహాలతో ఓటర్లకుగాలం వేస్తున్నారు.

Munugode By Election
మునుగోడు ఉపఎన్నిక

మునుగోడు ఉపఎన్నిక

Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు మరో 20 రోజులే మిగిలి ఉండటంతో... గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల రాష్ట్ర స్థాయి నేతలంతా నియోజకవర్గ బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపపోరు... అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్‌, భాజపాలు కీలకంగా భావిస్తున్నందున సత్తాచాటేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... ఉపఎన్నికకు కారణమైన భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఈ ఉపఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇప్పటికే గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న రాజగోపాల్​రెడ్డి... నిన్న భారీ జనసమీకరణతో చండూరులో నామినేషన్‌ వేశారు. బంగారుగడ్డ నుంచి... భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన చండూరు రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. బండి సంజయ్‌, తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, కిషన్‌ రెడ్డి, ఈటల, రఘునందనరావుతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. అధికారంలో ఉన్న తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... మునుగోడులో భాజపా విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి తొలి నుంచి కాంట్రాక్టర్‌ అని... కేసీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార తెరాస... రాజగోపాల్ రెడ్డి వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల దాహంతోనే ఉపఎన్నిక వచ్చిందనే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఉపఎన్నికను మునుగోడు ప్రజల ఆత్మగౌరవం, రాజగోపాల్‌ రెడ్డి అహానికి మధ్య పోటీగా పేర్కొన్న మంత్రి కేటీఆర్... ఎమ్మెల్యేగా రాజగోపాల్‌ వైఫల్యాలు, కాంట్రాక్టులను వివరిస్తూనే... ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. మునుగోడు అభ్యర్థి ప్రకటన తర్వాత తొలి ప్రచార కార్యక్రమాన్ని మునుగోడు మండలం కొరటికల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారు. అభ్యర్థి కూసుకుంట్ల, వామపక్ష నేతలతో కలిసి పర్యటించిన మంత్రి... రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన 18 వేల కోట్లను... నల్గొండ జిల్లాకు, మునుగోడు అభివృద్ధికి ఇస్తే ఉపఎన్నిక నుంచి తెరాస తప్పుకుంటుందని సవాల్ విసిరారు.

సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం... గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తోంది. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. భాజపా మంత్రాలతో చింతకాయలు రాలవని, తెరాస తంత్రాలతో ప్రజాసమస్యలు తీరవని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో అవకాశాలిచ్చిన కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని చూస్తున్న రాజగోపాల్‌రెడ్డి... దమ్ముంటే డిండి, ఎస్​ఎల్​బీసీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్రంలోని భాజపా సర్కార్‌ నుంచి నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉపఎన్నికలో రెండో రోజు 11మంది 16సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ 3సెట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఆ పార్టీ నేత ఒక సెట్‌ సమర్పించారు. 9మంది స్వతంత్రులు 12సెట్ల నామినేషన్లు అందజేశారు. ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత ఆస్తులు గత ఎన్నికలతో పోల్చితే భారీగా పెరిగాయి. 2018లో ఆయన పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ 24కోట్ల 55లక్షలు కాగా... తాజాగా ఎన్నికల సంఘానికి నివేదించిన అఫిడవిట్‌లో 222కోట్ల 66లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాల్వాయి స్రవంతి ఆస్తులు 24కోట్ల 69లక్షలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని 7మండలాల పరిధిలో ఈ నెల తొలి 10రోజుల్లోనే 70.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.