ETV Bharat / city

RRR : 'జగన్‌ అక్రమాస్తులపై దర్యాప్తు చేయాలి'

author img

By

Published : Feb 25, 2022, 5:33 AM IST

Updated : Feb 25, 2022, 5:56 AM IST

rrr
rrr

సీఎం జగన్ అక్రమాస్తులపై పూర్తి స్థాయిలో దర్యాపునకు ఆదేశించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని...విదేశాలనుంచి, బోగస్‌ కంపెనీలనుంచి జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని వివరించారు.

ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని, పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ.. విదేశాలనుంచి, బోగస్‌ కంపెనీలనుంచి జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని వివరించారు. గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హతపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది బి.భరత్‌చంద్ర వాదనలు వినిపించారు. పిటిషన్‌లో ఆరోపణలు చేసిన వ్యక్తులను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని, ఆరోపణలపై వారి వాదనలను వినకుండా ఉత్తర్వులెలా జారీ చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారిని ప్రతివాదులు చేయాల్సిన అవసరం లేదని, దానికి సంబంధించిన తీర్పు ప్రతిని అందజేస్తామని అన్నారు. ఈ విషయంపై రిజిస్ట్రీ సమాచారం ఇవ్వలేదని, ఏడాదినుంచి రిజిస్ట్రీ నెంబరు కేటాయించలేదని వివరించారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్‌ విచారణార్హతపై ఉత్తర్వులిస్తామంటూ వాయిదా వేసింది. 2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్‌ 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో వివరించారు. హౌరా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు జగతిలోకి వచ్చాయని, వీటిపై దర్యాప్తును ఐటీ, ఈడీలకు లేఖ రాసి సీబీఐ చేతులు దులిపేసుకుందని పేర్కొన్నారు. యాగా అసోసియేట్స్‌ ద్వారా హిందూజా గ్రూపునకు, మాజీ ఎంపీ బాలశౌరికి చెందిన కినెట పవర్‌ లిమిటెడ్‌, ఓఎంసీ-శైలజా గ్రూపు కంపెనీ, ఇండియాబుల్స్‌, మయాంక్‌ మెహతాలకు లబ్ధి చేకూర్చగా జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని వివరించారు. విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన నీల్‌డార్ట్‌ ఇన్‌ఫ్రా, కీలాన్‌ టెక్నాలజీల ద్వారా జగన్‌కు రావాల్సిన పెట్టుబడులను వసూలు చేసి మళ్లించినట్లు చెప్పారు. ఆర్వోసీ జగన్‌కు చెందిన కంపెనీల వ్యవహారాలను పట్టించుకోలేదని, తనిఖీలు చేసి తయారుచేసిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకోలేదని, వాటిపై దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరారు. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో నిందితులు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారని, సహ నిందితులకు కీలక పదవులు అప్పగించారని ఆరోపించారు. 2012-14 మధ్య 11 కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టలేదని, డిశ్ఛార్జి పిటిషన్ల పేరుతో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఈ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసేలా ఆదేశించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్రంతోపాటు సీబీఐ, ఈడీ, ఆర్వోసీ, సెబీ, ఐటీ శాఖలను పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కేంద్ర విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

Last Updated :Feb 25, 2022, 5:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.