ETV Bharat / city

మథర్స్​ డే: కొవిడ్‌ నుంచి కుటుంబాన్ని కాపాడుకున్న తల్లులు!

author img

By

Published : May 9, 2021, 4:47 PM IST

పసితనంలో తప్పటడుగులు వేసే వేళ జారిపడితే విలవిల్లాడుతుంది. పెరిగ పెద్దయ్యాక ఇంటికి రావటం ఆలస్యమైతే తల్లడిల్లుతుంది. కన్నబిడ్డలకు ఏ కాస్త కష్టమొచ్చినా భరించలేని మమకారం మాతృమూర్తి సొంతం. మాయదారి కరోనా కన్ను ఇంటిపై పడకుండా రక్షణగా నిలుస్తుంది. ఎటువైపు నుంచి ఆపద ముంచుకొస్తుందోననే భయంతో కంటిమీద కునుకులేకుండా పహారా కాస్తోంది.

కొవిడ్‌ నుంచి కుటుంబాన్ని కాపాడుకున్న తల్లులు
కొవిడ్‌ నుంచి కుటుంబాన్ని కాపాడుకున్న తల్లులు

మాయదారి కరోనా కన్ను ఇంటిపై పడకుండా ప్రతి తల్లీ రక్షణగా నిలుస్తోంది. ఎటువైపు నుంచి ఆపద ముంచుకొస్తుందోననే భయంతో కంటిమీద కునుకులేకుండా పహారా కాస్తోంది. అయినా మహమ్మారి ఒంట్లోకి.. తరువాత ఇంట్లోకి చేరి కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించినా అమ్మ ఆత్మబలం దానికి సమాధానమిస్తోంది. సున్నితమైన తల్లి మనసు వెనక దాగిన మనోధైర్యం ఆపద వేళ కుటుంబానికి రక్షణ కవచంగా మారుతోంది. క్లిష్ట సమయంలో కొవిడ్‌ బారినపడి స్వీయ నిర్బంధంలో ఉంటూ.. తాను బయటపడటమే గాకుండా.. కుటుంబాన్ని కంటిపాపగా కాపాడి స్ఫూర్తిగా నిలుస్తోన్న గృహిణుల అంతరంగం. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా కరోనాపై గెలిచిన అమ్మల విజయప్రయాణం.

లక్షణాలు కనిపించాక అలక్ష్యం వద్దు

గాది రోజు కాస్త జ్వరంగా అనిపిస్తే వైరల్‌ ఫీవర్‌ అనుకున్నా. మూడో రోజు వైద్యపరీక్షలకు వెళ్లాం. ఆయనకు, నాకు పాజిటివ్‌ అని తేలింది. వైద్యుల సూచనతో ఇంట్లోనే ఉంటూ మందులు వాడటం ప్రారంభించాం. శ్వాస సంబంధమైన వ్యాయామం, ధ్యానం రెండూ మనసుకు ఆహ్లాదం, శరీరానికి ప్రాణశక్తినిస్తాయి. మానసిక దృఢత్వం క్లిష్టమైన సమస్య నుంచి బయటపడేసే తొలిమార్గం. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చే వరకు ఆక్సిజన్‌ స్థాయిలు పరిశీలించుకోవాలి.

-అంజని, హఫీజ్‌పేట్‌, హైదరాబాద్

మనో నిబ్బరమే మందు

నా అయిదేళ్ల కూతురుకు గొంతునొప్పితో కొవిడ్‌ మొదలైంది. మూడ్రోజుల తరువాత నాన్నకు రుచి మాయమైంది. నాకు కఫంతో కూడిన దగ్గు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ 12 రోజులు మందులు, ఆహారం క్రమం తప్పకుండా తీసుకున్నా. మా చిన్నపాప దూరంగా ఉండి.. అమ్మా అని పిలిచినప్పుడు బాధేసేది. ఆక్సిమీటర్‌తో ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయిలు పరిశీలించుకుంటూ.. కొద్దిపాటి వ్యాయామంతో ఒత్తిడిని అధిగమించా. -సింధు, బొటిక్‌ యజమాని, బీరంగూడ, హైదరాబాద్

గుండె నిబ్బరం చాలా ముఖ్యం

నాకు, పిల్లలిద్దరికీ పాజిటివ్‌, మా వారికి నెగెటివ్‌ వచ్చింది. పిల్లల భవిష్యత్తు కోసం గుండె నిబ్బరం చేసుకున్నా. రుచి, వాసన తెలిసేది కాదు. పండ్లు, కషాయం, ఆవిరి పట్టడం సమయపాలన పాటించి వాడటంతో, ఐదు రోజుల్లో మామూలు మనుషులమయ్యాం.

-బత్తుల పావని, గృహిణి, కుషాయిగూడ, హైదరాబాద్

ధైర్యంగా ఉంటే కొవిడ్‌ను జయించొచ్చు

మా వారు థియేటర్‌ ఆర్ట్స్‌లో పనిచేస్తారు. ఒక డ్రామా రిహార్సల్స్‌లో కొవిడ్‌ సోకింది. ఆ తరువాత ఇంట్లో ఆరుగురుకి సోకింది. అందరికీ లక్షణాలు తీవ్రంగానే కనిపించినా భయపడకుండా ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచించిన మందులు, పోషకాహారంతో బయటపడ్డాం. నాకు ఉదయం లేవగానే తల బరువు, నీరసం, ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉండేవి. అయినా మిగతావారిని చూసి మొండిగా పనులు ప్రారంభించేదాన్ని. కరోనా కావడంతో ఎవరూ వచ్చి సాయం చేసేవారు కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, సూచనలతో పది రోజుల్లో సాధారణ స్థితికి వచ్చాం.

-ఎమ్‌.సరోజిని, గృహిణి, సైనిక్‌పురి, హైదరాబాద్

కుటుంబాన్ని బతికించుకోవాలనే తపన..

మా ఇంట్లో అందరికీ కొవిడ్‌ సోకింది. నాతో పాటు అమ్మానాన్న, మా వారు, ఇద్దరు పిల్లలు ఉంటాం. ముందు భయపడలేదు. అందరం ఒకేచోట ఉన్నామనే ధైర్యం వచ్చింది. ఎలాగైనా ఇంట్లోనే ఉండి పోరాడి కొవిడ్‌ను ఎదుర్కోవాలని ధృడంగా నిశ్చయించుకొన్నాం. ఇంట్లో అందరికీ లక్షణాలు ఉన్నాయి. ఉదయం లేవగానే నీరసం, ఒళ్లునొప్పులు బాగా వేధించేవి. వంట చేసేటప్పుడు కళ్లు తిరుగుతుండేవి. అయినా మా పనులన్నీ మేమే చేసుకున్నాం. ప్రాణాయామం, ధ్యానం చేసుకుంటూ, తాజా ఆహారం తీసుకున్నాం. మనోనిబ్బరం.. భవిష్యత్తుపై నమ్మకంతో బయటపడ్డాం.

-హరిచందన దండు, ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, నాగారం, హైదరాబాద్

తల్లి మాట.. సేవా బాసట!

తల్లి అచ్చాయమ్మతో డా. దశరథరామిరెడ్డి(ఎడమవైపు), కుటుంబసభ్యులు


‘‘వైద్యవృత్తి చాలా గొప్పది. సమాజానికి ఊపిరిపోయటమే కాదు.. ముందుకు నడిపించే మార్గం’అంటూ కన్నతల్లి అన్నమాటలు స్ఫూర్తిగా.. పేదలకు వైద్యం, చదువుకోవాలని ఆశపడే విద్యార్థులకు ఉన్నతవిద్యకు చేయూతనిస్తున్నారు యశోద ఆసుపత్రిలోని ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ తేతలి దశరథరామరెడ్ఢి తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన టి.నారాయణరెడ్డి, అచ్చాయమ్మ కుమారుడైన దశరథరామరెడ్డి తల్లిదండ్రుల పేరు మీద తేతలి నారాయణరెడ్డి, శ్రీమతి అచ్చాయమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ పేరిట కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో వైద్యశిబిరాలు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. కొవిడ్‌ కాలంలో వేలాది మందికి అవసరమైన వైద్యసలహాలు, మందులు పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

హైదరాబాద్​కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!

'రోజూ గోమూత్రం తాగితే కొవిడ్ నుంచి రక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.