ETV Bharat / city

మిరపకు వైరస్‌, తెగుళ్ల తాకిడి.. ఎకరాలకు ఎకరాలే తొలగింపు

author img

By

Published : Nov 14, 2020, 6:36 AM IST

భారీ వర్షాలు.. తెగుళ్లతో మిరప రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జెమినీ వైరస్‌(బొబ్బర తెగులు) విజృంభించడంతో.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో తోటలను తొలగిస్తున్నారు. కాయ కూడా కోయకముందే.. ఎకరాకు రూ.50 వేలకుపైగానే పెట్టుబడిని నష్టపోతున్నారు. ప్రస్తుతం మిరప ధరలు బాగుండటంతో... కొందరు రైతులు ఆశతో మళ్లీ ఇవే మొక్కలు నాటుతున్నారు. దీనికి ఎకరాకు అదనంగా రూ.25 వేలకు పైగా ఖర్చవుతోంది. మరికొందరు మాత్రం కంది, మినుము తదితర ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు.

mirchi farmers
mirchi farmers

కుండపోత వర్షాలతో.. మొదలైన నష్టం

* సెప్టెంబరు నుంచి మిరప నాటడం మొదలైంది. అప్పట్నుంచి భారీ వర్షాలే కురుస్తుండటంతో పల్లపుప్రాంతాల్లోని పంట దెబ్బతింది. నీరు నిలవడంతో మొక్కలు ఎర్రబారి.. క్రమంగా ఎండిపోయాయి.

* మెరక పొలాల్లోనూ తేమ ఎక్కువై వేరుకుళ్లు తెగులు సోకి మొక్కలు చనిపోయాయి. వీటి స్థానంలో మళ్లీ కొత్తవి నాటారు. ఇందుకు ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చు అయింది.

* ముసురు వాతావరణం, అధిక వర్షాలతో జెమినీ వైరస్‌ విజృంభించింది. దీని నివారణకు మందు కూడా లేదు. ఆకు ముడత క్రమంగా విస్తరించడంతో రైతులు పంటను తొలగించాల్సిన దుస్థితి ఏర్పడింది.

* ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, కొరిసెపాడు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో మిరపలో జెమినీ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. ఎక్కడ చూసినా ఎకరాలకు ఎకరాలే తొలగిస్తున్నారు.

* గుంటూరు జిల్లా మాచవరం ప్రాంతంలోనూ ఆకు ముడత ప్రభావం ఎక్కువగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు రైతులు మొక్కలు తొలగించారు.

* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో వేరుకుళ్లు, ఇతర తెగుళ్లతోపాటు జెమినీ వైరస్‌ ప్రభావంతో రైతులు భారీగా నష్టపోయారు. మళ్లీ కొత్తగా నాటుతున్నారు.

* అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలో తోటలు తొలగించి రోడ్ల పక్కన కుప్పలు వేస్తున్నారు. కొన్ని రోజులుగా తెగులు విస్తరిస్తోంది.

* కర్నూలు జిల్లాలోనూ వేరుకుళ్లు తెగులుతోపాటు వైరస్‌ ప్రభావంతో కొంత దెబ్బతినగా.. వర్షాలకు మరికొంత దెబ్బతింది. చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో కొందరు తొలగిస్తున్నారు. మరికొందరు గొర్రెల మేతకు వదిలేస్తున్నారు.

మరే పంట వేయలేక.. మళ్లీ దీనిపైనే మొగ్గు

గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మిరప పొలాలకు ఎకరాకు రూ.25 వేలపైన కౌలును ముందే చెల్లిస్తుంటారు. దీనికి అదనంగా ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టాక తోటలు దెబ్బతిన్నాయి. ఈ పొలాల్లో కంది, మినుము తదితరాలను వేసినా నష్టం తగ్గదనే ఆలోచనతో రైతులు మళ్లీ ఎకరాకు రూ.25 ఖర్చు చేస్తూ మిరపనే నమ్ముకుంటున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తదితర ప్రాంతాల రైతులు గుంటూరు జిల్లా నుంచి నారు తెస్తున్నారు.

ఇదీ చదవండి: భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్​ సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.