ETV Bharat / city

ప్రధాన డిమాండ్​ పరిష్కరించాం.. సమ్మె విరమించాలి: మంత్రి సురేష్‌

author img

By

Published : Jul 14, 2022, 7:22 PM IST

Updated : Jul 15, 2022, 4:36 AM IST

మంత్రి సురేష్‌
మంత్రి సురేష్‌

19:21 July 14

హెల్త్ అలవెన్సుతో కలిపి వేతనం రూ.21 వేలు

ప్రధాన డిమాండ్​ పరిష్కరించాం.. సమ్మె విరమించాలి: మంత్రి సురేష్‌

నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భత్యం రూ.6 వేలతో కలిసి నెలకు రూ.21 వేల వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాకు వెల్లడించారు. కార్మికుల ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మె విరమించాలని ఆయన సూచించారు. ఈ నెల 11 నుంచి పుర, నగరపాలక సంస్థల, నగర పంచాయతీల్లోని ఒప్పంద కార్మికులు సమ్మెకు దిగారు. అదే రోజు సాయంత్రం కార్మిక సంఘాల ఐకాస నేతలతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిలిపివేసిన రూ.6 వేల ఆరోగ్య భత్యంతో కలిపి జీతం రూ.21 వేలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌పై చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. రూ.15 వేలకు మించి ఇవ్వలేమని మంత్రులు స్పష్టం చేయడంతో ఐకాస నేతలు సమ్మెను కొనసాగించారు. తొలుత నిర్ణయించిన ప్రకారం కార్మికులు శుక్రవారం నుంచి అన్ని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ కార్యాలయాలను ముట్టడించాలి. అత్యవసర సేవలైన విద్యుత్తు, తాగునీటి సరఫరా, ఇంజినీరింగ్‌ విభాగాల్లోని కార్మికులు, సిబ్బంది సమ్మెలో పాల్గొనేలా నేతలు ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట గురువారం నిర్వహించిన కార్మికుల సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కూడా హాజరై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో కార్మికులకు నెలకు రూ.21 వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని ప్రకటించడం ద్వారా సమ్మెకు తెరదించే ప్రయత్నం చేశారు.

గతంలో ఇచ్చిందే..: ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.12 వేల చొప్పున జీతంతోపాటు రూ.6 వేల ఆరోగ్య భత్యం ఇవ్వాలని 2019 ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయించింది. 2022 జనవరి వరకు కార్మికులకు జీతం, ఆరోగ్య భత్యం వేర్వేరుగా చెల్లించారు. జీవో 7 ప్రకారం కార్మికుల జీతాన్ని ప్రభుత్వం 2022 జనవరిలో రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. దీనికి ఆరోగ్య భత్యం రూ.6 వేలు కలిపి మొత్తం రూ.21 వేలు రావాలి. ఆరోగ్యభత్యం రూ.6 వేలు జనవరి నుంచి నిలిపివేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు.

కార్మిక సంఘాలతో పని లేదా?: గురువారం నాటి మంత్రుల కమిటీ సమావేశానికి తమను పిలవకుండా ఆరోగ్య భత్యంతో కలిపి రూ.21 వేలు చెల్లించాలని సీఎం నిర్ణయించారని ప్రకటించడం ద్వారా కార్మిక సంఘాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న అభిప్రాయాన్ని ఐకాస నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సమావేశం ముగిశాక కూడా కార్మిక సంఘాలకు మంత్రుల నుంచి సమాచారం లేదు. రోజూ హాజరు వేసే ప్రాంతానికి (మస్టర్‌ పాయింట్‌)కి శుక్రవారం ఉదయం కార్మికులను పిలిపించి ..నెలకు రూ.21 వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలియజేయాలని పుర, నగరపాలక కమిషనర్లను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

సమ్మె విరమణపై నేడు నిర్ణయం: శుక్రవారం అన్ని పుర, నగరపాలక సంస్థల కార్యాలయాల ఎదుట కార్మికులు ధర్నా చేస్తారని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్లు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు తెలిపారు. సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కార్మిక సంఘాల ఐకాస నేతలు శుక్రవారం విజయవాడలో సమావేశమై దీనిపై చర్చించనున్నారు. ‘రూ.21 వేలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించడం సానుకూలాంశమైనా.. కార్మిక సంఘాలను చర్చలకు పిలవకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాన్ని ప్రకటించింది. సమ్మె కొనసాగింపు అంశంతోపాటు ఇంజినీరింగ్‌, శాశ్వత కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపైనా నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని ఐకాస కన్వీనర్లు ఉమామహేశ్వరరావు, సుబ్బరాయుడు గురువారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. ప్రైవేట్​ ఏజెన్సీల ద్వారా చెత్త తొలగింపునకు చర్యలు

ఈ భామకు ఇంత డిమాండా...? యాక్టింగ్‌ తక్కువ... రెమ్యునరేషన్‌ అన్నికోట్లా...?

భారత్​లో మంకీపాక్స్ కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​

Last Updated :Jul 15, 2022, 4:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.