ETV Bharat / city

Pending Bills Issue: కాంట్రాక్టర్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు: మంత్రి శంకర నారాయణ

author img

By

Published : Jan 8, 2022, 3:59 PM IST

Minister Shankar Narayana on Roads development: రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిస్తామని ఆ శాఖ మంత్రి శంకరనారాయణ వెల్లడించారు. దీంతో పాటు గడిచిన 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న 550 కోట్ల రూపాయలను కూడా త్వరలోనే కాంట్రాక్టర్లకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, మరమ్మతులపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఎన్డీబీ రుణ సహకారంతో చేపట్టిన పనుల్లో కదలిక లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.

Minister Shankar Narayana
Minister Shankar Narayana

Minister Shankar Narayana on Roads development: రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు చెల్లిస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ప్రకటించారు. మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న 550 కోట్ల రూపాయల మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాల్సిందిగా సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్(ఎన్డీబీ) రుణ సహకారంతో 2970 కోట్ల రూపాయలతో తొలిదశలో చేపట్టిన పనులకు సంబంధించి త్వరితగతిన పనులు చేపట్టకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా బిల్లులను చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. జనవరిలోగా పనుల్లో కదలిక లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Roads development in andhrapradesh: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులు, అభివృద్ధికి సంబంధించి రూ.2208 కోట్ల వ్యయంతో 1152 పనులకు అనుమతి మంజూరు అయిందని మంత్రి వెల్లడించారు. 1764 కోట్ల రూపాయల వ్యయమయ్యే పనులు చేపట్టేందుకు వీలుగా ఒప్పందాలు జరిగినట్టు తెలిపారు. మిగిలిన పనుల్ని కూడా వచ్చే నెలలోగా ఒప్పందాలు పూర్తి చేసి కార్యాచరణ ప్రారంభించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. జూన్ 2022 లోగా మరమ్మతుల పనులు పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు. చిత్తూరు, కడప, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కృష్ణా, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇప్పటికే రహదారుల అభివృద్ధి పనులు వేగంగా మంత్రి స్పష్టం చేశారు.

రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు ప్రతీ రెండు జిల్లాలకూ ఓ చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రహదారి భద్రతా ప్రమాణాలు పాటించేలా లేన్ మార్కింగ్​లు, సైన్ బోర్డులు, క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. నాడు-నేడు తరహాలో రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాల్సిందిగా సూచనలు జారీ చేశారు. మరోవైపు 276 కోట్ల రూపాయలతో అత్యవసర ప్రాతిపదికన చేపట్టిన రహదారి మరమ్మతుల పనులు ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి కానున్నట్టు అధికారులు తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం 155 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపిన మంత్రి.. ఈ పనులు మార్చిలోగా పూర్తి కావాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

'రామకృష్ణను బెదిరించినట్లు.. వనమా రాఘవ అంగీకరించాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.