ETV Bharat / city

తెలంగాణలో ప్రేమ కోసం ఆత్మహత్యలు

author img

By

Published : Dec 20, 2020, 8:33 PM IST

Updated : Dec 20, 2020, 8:40 PM IST

రెండు మనసులను ఏకం చేసిన ప్రేమ.. రెండు కుటుంబాలను కలపలేకపోతోంది. చావడానికి ధైర్యం ఇస్తోంది కానీ... పెద్దల్ని ఒప్పించే శక్తినివ్వలేకపోతోంది. కుల, మతాలకతీతంగా ఆదరించే ప్రేమ.. ప్రేమికులకు జీవితంపై భరోసానివ్వలేకపోతోంది. ప్రేమే ప్రాణంగా బతికే వారికి…బతుకే నిజమైన ప్రేమ అని చెప్పలేకపోతోంది. ప్రేమను బతికించుకోవడం అంటే.. తమను తాము బలి ఇచ్చుకోవటం కాదు.. అనే నిజాన్ని ప్రేమికులకు అర్థమయ్యేట్లు వివరించలేక పోతోంది. ఫలితంగా.. ప్రేమించిన వారితో కలిసి బతలేక.. చావులోనైనా తోడుగా ఉండాలనే క్షణికావేశాలతో అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు కొందరు యువత. కొన్ని రోజులుగా అవే వరస ఉదంతాలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి.

lovers suicide cases
తెలంగాణలో ప్రేమ కోసం ఆత్మహాత్యలు

తెలంగాణలో ప్రేమ కోసం ఆత్మహత్యలు

జీవితాంతం కలిసి బతకాలనుకునే రెండు మనసుల్ని దగ్గర చేసింది ప్రేమ. అదే ప్రేమ సాక్షిగా ఆ జంట ఒకటవ్వాలనుకుంది. కానీ.. చివరకు పెద్దల ఆగ్రహం, ఆంక్షల మంటల్లో ఆ ప్రేమపక్షులు సమిధలవుతున్నారు. ఎన్నో ఆశలతో నిర్మించుకున్న ప్రేమసౌధం అర్ధాంతరంగా సమాధి అవుతోంది. ఇష్టమైన వారితో జీవించలేని బతుకు మాకేందుకు..? అనుకుంటున్నారేమో..! కనీసం చావులోనైనా తోడుగా ఉండాలని పరితపిస్తున్నారు. శుభలేఖలో వధూవరులుగా అచ్చు పడని తమ పేరులు.. మరణించిన తర్వాతైనా ప్రేమజంటగా మిలిగిపోతామని ఉసురు తీసుకుంటున్నారు. అలా... ప్రేమను బతికించుకునేందుకు అనుకుంటూ.. తమను తాము బలి ఇచ్చుకుంటున్న... ప్రేమ జంటలెన్నో..

కన్నవాళ్లు ఒప్పుకోలేదని.. కలిసి బతకలేమని

వరంగల్‌ జిల్లా నక్కలపల్లికి చెందిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. మన్నె సాయికుమార్‌ దిల్లీలో, తాటిపాముల అశ్విని వరంగల్‌లో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. హైదరాబాద్‌లో ఓ వృత్తివిద్యా కోర్సు చదివే సమయంలో ఒకరినొకరు ఇష్ట పడ్డారు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి ప్రేమను అంగీకరించని యువతి తల్లిదండ్రులు, మరొకరితో ఆమె వివాహం జరిపించారు. మూడు ముళ్లు పడినా ప్రేమికుడిని మరువలేని ఆయువతి... ప్రేయసికి పెళ్లయిందని తెలిసినా ఆమెను వీడి ఉండలేక ఆ యువకుడు మనోవేదనకు గురయ్యారు. చివరకు పరస్పరం చేతులను తాళ్లతో బిగించుకొని నీళ్లలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సామాజికి వర్గాలే... అడ్డుగోడలై..

నారాయణపేట జిల్లాలోను ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నర్వ మండలంలోని లంకాలకు చెందిన ఉప్పరి శేఖర్‌, అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించడం వల్ల మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 16 ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడమే ఆ జంట ఆత్మహత్యకు కారణం.

కన్న వాళ్లను ఒప్పించలేక..

ఇలానే ఓ విఫల ప్రేమ విశాఖల్లో ముగ్గురి ప్రాణాలు తీసింది. డిసెంబర్‌ 11న సూర్యాపేట జిల్లాలోని మునగాల మండల పరిధిలోని మోద్దుల చెరువు శివారులో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. మోద్దులచెరువు స్టేజ్ దగ్గరలో ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరివేసుకున్నారు. వీరి ప్రేమకు సైతం పెద్దలు అంగీకరించకపోవడమే ప్రధాన కారణం.

కలిసి బతకలేమని..

నవంబర్‌ 5న వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ యువ ప్రేమ జంట పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మల్‌రెడ్డిపల్లికి చెందిన బాల్‌రాజ్‌, ఓ యువతి 5 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పదోతరగతి పూర్తి చేశారు. ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడం వల్ల మందలించారు. కలుసుకోకుండా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుని బతకలేమనే అభిప్రాయంతో పురుగుల మందు తాగారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలను కోల్పోయారు.

పురుగులమందు తాగి.. ఉరి వేసుకుని..

నవంబర్‌ 16న... జగిత్యాలలో జరిగిన ప్రేమజంట ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధు, సౌమ్య ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. కానీ పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో పాడుబడిన ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి .. ఉరేసుకున్నారు. పదిరోజల తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు ఇష్టం లేని పదార్థాలు తినిపించడానికే పెద్దలకు మనసు ఒప్పదు. అలాంటిది.. పురుగులమందు తాగి.. చనిపోతామో లేదో అన్న అనుమానంతో ఉరేసుకున్న వారి స్థితిని చూసి... వారి కుటుంబ సభ్యుల గుండెలు పగిలాయి.

ప్రేమ ఎంత కఠినం

ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ఇంకెన్నో. అక్కడ, ఇక్కడ అని కాదు రెండు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రేమ జంట చావు బతుకులతో పోరాడుతూనే ఉంది. పెద్దలు అంగీకరించక పోయినా.. పెళ్లి చేసుకుని ఎక్కడో ఒక చోట జీవించవచ్చు. కానీ, అనవసర ఆలోచనలతో ప్రేమికులు ఈ లోకం వదలి వెళుతున్నారు. ఈ చేదు ఘటనలకు కారణం... పెద్దలా...? లేదా ప్రేమికులా..? ఎవరైతేనేం... జీవితంలో ఇంకా ఎన్నో చూడాల్సిన రెండు జీవితాలు మాత్రం అర్ధాంతరంగా ఆరిపోతున్నాయి కదా...! మధ్యలో మరెంతోమంది సంబంధం లేని వారి జీవితాలు తలకిందులు అవుతున్నాయి.

ఇదీ చూడండి: చదువుకున్నా.. కుటుంబాన్ని బాగా చూసుకోలేకపోతున్నానని యువకుడి ఆత్మహత్య

Last Updated : Dec 20, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.