ETV Bharat / city

ready made house: చిటికెలో ఇల్లు తయార్​.. ఎటైనా తీసుకెళ్లేలా అద్భుత సౌకర్యం!

author img

By

Published : Jul 5, 2021, 4:58 PM IST

ఇల్లు కట్టాలంటే లక్షల్లో ఖర్చు. కరోనా వల్ల ఇప్పుడు ఆ ఖర్చు రెండింతలయింది. కష్టమో నష్టమో ఓర్చి.. ఇల్లు కట్టినా.. ఉద్యోగరీత్యానో.. మరే కారణం చేతనో వదిలేయాల్సి వస్తే. ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లును విడిచిపెట్టలేక.. వేరే ఏ మార్గం లేక పడే బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే రెడీమేడ్ ఇళ్లు. వీటిని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లొచ్చు. రాబోయే కాలంలో ఈ ఇళ్లదే అసలైన ట్రెండ్.. అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రెడీమేడ్ ఇల్లు
ready made house

రెడీమేడ్ ఇల్లు

సాధారణంగా.. ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. అలా ఎంతో శ్రమకోర్చి కట్టిన ఇల్లు వదిలిపెట్టి వేరేచోటుకు వెళ్లాల్సి వస్తే ఎంతో బాధగా ఉంటుంది కదూ. అలాంటి పరిస్థితి వస్తే.. మన వెంటే ఇల్లును కూడా తీసుకెళ్తే ఎంత బాగుంటుందో కదా. అలా మన వెంట తీసుకెళ్లగలిగే ఇల్లు కూడా ఉంటాయని మీకు తెలుసా? ఆ ఇల్లు రెడీమేడ్​ అయితే.. మనం ఎక్కడికి వెళ్లినా తీసుకువెళ్లొచ్చు. కరోనా వల్ల అన్నింటి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇల్లు కట్టాలంటే కష్టమే. ఇసుక, సిమెంట్, ఇనుము కొనాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా.. మన ఇల్లు ఉన్న చోటు నుంచి వేరే చోటుకు మారాలాన్నా.. మన వెంటే ఇంటిని తీసుకెళ్లేందుకు వీలుగా ఇప్పుడు మార్కెట్​లో రెడీమేడ్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్యాబ్రికే మెటీరియల్..

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో చింత అనంతరామిరెడ్డి అనే వ్యక్తి ఇలాంటి రెడీమేడ్ ఇల్లునే కొనుగోలు చేశారు. అచ్చం.. మనం కట్టుకున్న ఇల్లులాగే ఉన్న ఈ ఇల్లును హైదరాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్​ ఇచ్చి తయారు చేయించారు. సిమెంట్, కాంక్రీట్ అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ మెటీరియల్​తో.. ఆధునిక హంగులతో ఈ ఇంటిని నిర్మించారు.

రూ.6 లక్షల్లో అందమైన ఇల్లు..

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి గుడిబండకు ఓ కంటైనర్​ ద్వారా ఈ ఇల్లును తీసుకువచ్చి అమర్చారు. ఇందులో నలుగురు సభ్యులుండే చిన్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు కల్పించారు. హాలు, బెడ్​రూం, కిచెన్, టాయిలెట్​ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయింది.

నాకు 20 ఎకరాల పొలం ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిమీద వచ్చినప్పుడు సేద తీరేందుకు ఓ రెండు గదులతో ఇల్లు నిర్మిద్దామనుకున్నాను. అదే విషయం నా స్నేహితునికి చెప్పాను. అప్పుడు అతను నాకు రెడీమేడ్ ఇల్లు గురించి చెప్పాడు. కరోనా సమయంలో సిమెంట్, ఇసుక, కాంక్రీట్, ఇనుము అన్నింటి ధరలు పెరిగాయి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. నా ఫ్రెండ్ ఇచ్చిన రెడీమేడ్ ఇల్లు ఐడియా నాకు నచ్చింది. అది నా బడ్జెట్​లో ఉందనిపించి.. హైదరాబాద్​ కొంపల్లిలోని ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాను. ఈ ఇల్లు చాలా బాగుంది. భవిష్యత్​లో నేను ఈ ఇంటిని విడిచివెళ్లాల్సి వచ్చినా.. నా వెంటే తీసుకువెళ్లొచ్చు.

- అనంతరామిరెడ్డి, గుడిబండ

ఇదే బెస్ట్ ఛాయిస్..

తన వ్యవసాయ క్షేత్రంలో ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో ఈ ఇల్లును అమర్చారు. పచ్చని పొలాల మధ్య ఆధునిక హంగులతో అందంగా ముస్తాబైన ఈ ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించాలంటే రెడీమేడ్ ఇల్లే బెస్ట్ ఛాయిస్ అంటున్నారు సందర్శకులు.

ఇదీ చదవండి:

ఏపీకి అన్యాయం జరుగుతోంది.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.