ETV Bharat / city

రాష్ట్రానికి 'కైనెటిక్' పరిశ్రమ

author img

By

Published : Oct 28, 2020, 7:41 AM IST

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి కైనెటిక్ సంస్థ రూ.1,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరిపారు.

minister gowtham reddy
పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కైనెటిక్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరిపారు. యూనిట్‌ ఏర్పాటు కోసం లంబోర్గినితో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసే కైనెటిక్‌ సంస్థ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. గోల్ఫ్‌, ఇతర క్రీడల్లో వినియోగించే వాహనాలను ఈ ప్లాంటులో తయారు చేయనున్నారు. ఇందుకోసం దశల వారీగా రూ.1,800 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఓడరేవు సమీపంలో...

దేశీయ అవసరాలతో పాటు ఎగుమతుల లక్ష్యంగా కైనెటిక్‌ ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓడరేవుకు (పోర్టు)సమీపంలో ఉండే భూములను కేటాయించాలని కోరింది. నెల్లూరు జిల్లాలో ప్లాంటు ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూములను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కనీసం 150 ఎకరాల భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. నెల్లూరులోని కృష్ణపట్నం ఓడరేవుకు అనుసంధానంగా ఉన్న భూములను అధికారులు పరిశీలిస్తున్నారు.

రాయితీలపై సంప్రదింపులు

ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల పై సంస్థ చర్చిస్తోంది. 2020-23 పారిశ్రామిక విధానం ప్రకారం కనీసం 2 వేల మందికి ఉపాధి కల్పించే వాటినే భారీ పరిశ్రమలుగా ప్రభుత్వం పరిగణించి రాయితీలను ప్రకటించింది. ఈ నిబంధన వర్తింప చేస్తే కైనెటిక్‌ సంస్థ భారీ పరిశ్రమల కేటగిరిలోకి వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడానికి వీలుండదు.. పెట్టుబడి మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రోత్సాహకాలను కోరుతున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. వాహనాల తయారీ యూనిట్‌తో పాటు, ఛార్జింగ్‌ స్టేషన్లు, ఆర్‌ అండ్‌ డీ యూనిట్లను సంస్థ ఏర్పాటు చేయనుంది.

కొప్పర్తి ఈఎంసీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి: మంత్రి గౌతమ్‌రెడ్డి

కడపలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ)లో కేవలం మూడునాలుగు నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. బహుళ జాతి ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌, సెల్‌ఫోన్ల తయారీ సంస్థల ఛైర్మన్లు, ఎండీలతో మంగళవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పర్తి ఈఎంసీలో సుమారు ఆరు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని దీనిని ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సెల్‌కాన్‌, డెల్‌, ఐసీఈఏ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టోరే, హిందూస్థాన్‌ షిప్‌యార్డు, బ్రాండిక్స్‌, శ్రీసిటి సంస్థల ఛైర్మన్లు, ఎండీలతో మంగళవారం వెబినార్‌ ద్వారా మాట్లాడారు.

ఇదీ చదవండి:

మానవత్వమే బంధం...వృద్ధురాలికి సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.