ETV Bharat / city

KCR on Munugode Bypoll: కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్.. సక్సెస్ అయ్యేనా!

author img

By

Published : Oct 8, 2022, 9:48 AM IST

CM KCR
సీఎం కేసీఆర్​

KCR on Munugode Bypoll: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస.. ప్రచారం కోసం సుమారు 2 వేల మంది పార్టీ శ్రేణులను నియోజకవర్గానికి పంపిస్తోంది. ఇప్పటికే కొందరు ప్రచారం మొదలు పెట్టగా.. ఇవాళో, రేపో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. వివిధ సామాజిక, ఉద్యోగ, సంక్షేమ సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్​రావు సహా ముఖ్యనేతలందరూ హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

KCR on Munugode Bypoll: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికకు అస్త్రశస్త్రాలన్నింటినీ గులాబీ పార్టీ ప్రయోగిస్తోంది. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి బీఫారం ఇచ్చిన కేసీఆర్.. పార్టీ నేతలందరినీ మొహరిస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే అభ్యర్థి అని చాలా రోజుల క్రితమే స్పష్టతనిచ్చినప్పటికీ.. భారాసగా మార్చే ప్రయత్నంలో ఉన్నందున అధికారికంగా ప్రకటించలేదు. ఓ వైపు నామినేషన్లు ప్రారంభం కావడం.. మరోవైపు భారాస పేరు మార్పు ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున... కూసుకుంట్లకు తెరాస బీ-ఫారం ఇచ్చారు.

అయితే కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని గతంలో కొందరు నాయకులు బహిరంగంగానే సమావేశం పెట్టుకున్నందున.. పార్టీలో అసంతృప్తి లేదన్న సంకేతాలు ఇచ్చేందుకు తెరాస ప్రయత్నిస్తోంది. స్థానిక నాయకులందరినీ ఇప్పటికే బుజ్జగించగా.. టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ను స్వయంగా కేసీఆర్ పిలిచి మాట్లాడారు. భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని.. కూసుకుంట్ల గెలుపు కోసం పనిచేయాలని కేసీఆర్ కోరగా.. ఇద్దరు నాయకులు అంగీకరించారు. కూసుకుంట్ల ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల రూపాయలను తెరాస నిధుల్లో నుంచి కేసీఆర్ ఇచ్చారు.

మునుగోడులో ప్రచార హోరు అదరగొట్టేలా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాలు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌కు దాదపు నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలందరూ హాజరయ్యేలా సన్నాహాలు చేస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా కీలక నేతలందరూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వేల మంది ఓటర్లకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి బాధ్యత అప్పగించారు. మొత్తం 86 మందిని ఇంచార్జిలుగా నియమించిన తెరాస నాయకత్వం.. ఒక్కో నాయకుడు వారి సొంత నియోజకవర్గం నుంచి కనీసం 20 మందిని మునుగోడుకు పంపించాలని నిర్దేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల మందికి పైగా ఇతర నియోజకవర్గాల నాయకులు మునుగోడులో దిగుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల కోసం గ్రామాల్లో వసతి, భోజనం ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు నేతలు మునుగోడులో ప్రచారం ప్రారంభించారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ కవిత, తదితరులు నిన్న పర్యటనలు చేశారు. మిగతా ముఖ్య నాయకులు నేడో, రేపో నియోజకవర్గానికి చేరనున్నారు.

అధికార తెరాసకు మద్దతునిస్తున్న ఉభయ వామపక్షాలైన సీపీఐ, సీపీఎం ఈ నెల 11న మునుగోడులో బహిరంగ సభను నిర్వహించనున్నాయి. తెరాసకు వామపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో ఇందులో ప్రజలకు వివరిస్తామని.. రెండు పార్టీల నాయకులు వెల్లడించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి.. రెండు పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీల శ్రేణులు కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందిచామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. వివిధ సామాజిక, సంక్షేమ సంఘాలను ప్రత్యక్షంగా ప్రచారంలోకి దించేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను గౌడ సంఘాలు, కేటీఆర్​ను ముదిరాజ్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు కలిశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.