ETV Bharat / city

'రైతులను మోసం చేయడంలో... సీబీఐ దత్తపుత్రుడు జగన్‌ను మించినవాళ్లు ఉండరు'

author img

By

Published : May 16, 2022, 8:31 PM IST

Janasena: రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్‌మోహన్‌ రెడ్డిని మించినవాళ్లు ఉండరని జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గణపవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌గా ప్రకటన విడుదల చేశారు.

Janasena
నాదెండ్ల మనోహర్‌

Janasena: రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్‌మోహన్‌ రెడ్డిని మించినవాళ్లు ఉండరని జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గణపవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌గా ఓ ప్రకటన విడుదల చేశారు. "వాస్తవంగా వైకాపా చెప్పిన ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులను కలుపుకుంటే ప్రతి రైతుకు రూ.19,500లు రావాలి.. కానీ ఇస్తున్నది కేవలం రూ.13,500 మాత్రమే. అంటే ఒక్కో రైతుపై రూ.6వేలు జగన్‌ సర్కార్‌ మిగుల్చుకుంటోంది. దీనికి ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. తాను రైతు బిడ్డనని చెప్పుకొంటున్నారు. అలా చెప్పడానికి సిగ్గుపడాలి. ఆయన చంచల్‌గూడ బిడ్డ అని అందరికీ తెలుసు. ఈ రోజు గణపవరంలో ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ దత్తపుత్రుడు చేసిన ప్రసంగం మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్లగక్కడానికే సరిపోయింది. పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్నీ చూపలేకపోయారనడం ముఖ్యమంత్రి అవగాహనారాహిత్యాన్ని వెల్లడిస్తోంది" అని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించి 200మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారని నాదెండ్ల అన్నారు. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారని స్పష్టం చేశారు. ఈ 200 మంది కౌలు రైతులు కాదు అని జగన్ రెడ్డి చెప్పగలరా? అని ప్రశ్నించారు. పోలీసు రికార్డుల్లో స్పష్టంగా రాశారన్నారు. కౌలుకి భూమి తీసుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని జీవో 102, 43లను అనుసరించి ఎందుకు రూ.7 లక్షలు ఇవ్వడం లేదని నిలదీశారు. మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల దగ్గరకు వెళ్లడం లేదని తెలిపారు. కొన్ని కుటుంబాలను త్రిసభ్య కమిటీ కూడా విచారించిందని స్పష్టం చేశారు. వారికి కేవలం రూ.లక్ష పరిహారం ఇచ్చి సరిపెట్టారని మండిపడ్డారు. కౌలు రైతు కాని పక్షంలో అధికారులు వెళ్లడం, కంటి తుడుపుగా పరిహారం ఇవ్వడం చేయరు కదా అని దుయ్యబట్టారు. తాము ఆర్థిక సాయం చేసినవారికి సంబంధించిన వివరాలు, పోలీసు రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తామన్నారు. అప్పుడు సీబీఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.

'వైకాపా ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా, రైతు శ్రేయస్సును పట్టించుకోకుండా సాగిస్తున్న పరిపాలనతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టం-కౌలుకి వ్యవసాయం చేసుకునే పేదలకు రుణాలు కూడా రాకుండా చేస్తోంది. కౌలు రైతులకు ఇచ్చే అర్హత కార్డులు కూడా రాకుండా చేస్తున్నారు. ఫలితంగా వారికి బ్యాంకు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా ఏమీ వర్తించడం లేదు. రైతులను కులాలవారీగా విభజించి లబ్ధి పొందాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైకాపా సర్కారే.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ నిధుల నుంచి రూ.7 లక్షలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి బాధపడిపోతున్నారు. పవన్ కల్యాణ్ తన కష్టార్జితం నుంచి ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారు. జగన్ రెడ్డికి రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులను కులాలవారీగా విభజిస్తూ తీసుకువచ్చిన నిబంధనను తొలగించాలి. ప్రతి కౌలు రైతుకీ రైతు భరోసా వర్తింపజేయాలి. అలాగే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికీ రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించాలి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి, గొప్పలు చెప్పుకున్నా రైతులు విశ్వసించరు.. వాస్తవాలు ఏమిటో రైతాంగానికి తెలుసు" అని మనోహర్‌ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.