ETV Bharat / city

జగనన్న విద్యా దీవెన నగదును.. తల్లుల ఖాతాల్లో జమ చేయాలి: సీఎం

author img

By

Published : Mar 25, 2021, 8:45 PM IST

విద్యాదీవెన కింద ఏప్రిల్‌ 9న బోధనా ఫీజుల చెల్లింపులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యా దీవెన కింద 10 లక్షలమందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఏడాది భర్తీ చేసే పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఉద్యోగాల భర్తీ, అటానమస్‌ కళాశాలల్లో పరీక్ష విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

CM Jagan, CM Review
CM Jagan, CM Review

విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్‌ 9న బోధనా ఫీజుల చెల్లింపులు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వసతి దీవెన విడుదలపై ఏప్రిల్‌ 27న అధికారులతో సమీక్ష చేసిన సీఎం... ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నగదు జమ చేయాలని స్పష్టం చేశారు. విద్యా దీవెన కింద 10 లక్షలమందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి వివరించారు. గతేడాది కంటే 50 వేల వరకు డిగ్రీ అడ్మిషన్లు పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు.

క్యాలెండర్‌ సిద్ధం చేయాలి...

ఈ ఏడాది భర్తీ చేసే పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఉగాది రోజున క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలన్న ముఖ్యమంత్రి... ఈ ఏడాది 6 వేల పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు స్పష్టం చేశారు. ఒంగోలు, శ్రీకాకుళం ఐఐఐటీల అభివృద్ధికి త్వరగా నిధులివ్వాలని ఆదేశించారు.

విద్యారంగంలో కీలక నిర్ణయం...

అటానమస్‌ కళాశాలల్లో పరీక్ష విధానంపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. విద్యారంగంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్... అటానమస్‌ కళాశాలల్లో పరీక్షల విధానంలో మార్పులు చేయాలని చెప్పారు. సొంతంగా ప్రశ్నపత్నాలు తయారుచేసుకునే విధానం రద్దు చేయాలని స్పష్టం చేశారు. జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నపత్రాలే వినియోగించాలని సూచించారు. అటానమస్, నాన్‌ అటానమస్‌ కళాశాలలకూ ఇవే ప్రశ్నపత్రాలు ఉండాలన్ని ముఖ్యమంత్రి... వాల్యూయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే ఇవ్వాలని నిర్ణయించారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలి. నైపుణ్యం లేకుంటే ముఖాముఖి పరీక్షల్లో నెగ్గలేం. ప్రతి కోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తేవాలని నిర్ణయించాం. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఉండదు. నచ్చిన సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఉండాలి. విద్యార్థులకు కొత్త కొత్త సబ్జెక్టులు అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విధానాన్ని అధికారులు పరిశీలించాలి. విశాఖలో మరో డిగ్రీ కళాశాల నిర్మించాలి. విశాఖ కళాశాలలో మంచి ఆర్ట్స్‌ సబ్జెక్టులు ప్రవేశపెట్టాలి.- వైఎస్. జగన్​మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.