ETV Bharat / city

పేదోడి ఇంటిపై ధరల బరువు..

author img

By

Published : May 31, 2022, 9:07 AM IST

బహిరంగ మార్కెట్‌ ధరలతోపాటే జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సిమెంటు, ఇనుము ధర కూడా పెరగడం లబ్ధిదారులకు భారంగా మారుతోంది. గృహ నిర్మాణాలు ప్రారంభమైన ఏడాదిన్నరలోనే ఈ రెండింటి మీద ఒక్కో లబ్ధిదారుడిపై రూ.10 వేల భారం పెరిగింది. కాస్త నాణ్యంగా కట్టుకుంటే అదనంగా మరో రూ.60 వేలు పడుతోంది. 2020లో పథకం ప్రారంభంలో గృహ నిర్మాణ సంస్థ టన్ను ఇనుము రూ.56 వేలకు టెండర్లు పిలిచి లబ్ధిదారులకు అందించింది. ప్రస్తుతం అది రూ.72వేల నుంచి రూ.74వేలకు చేరింది. నిన్నమొన్నటి వరకు సిమెంటు బస్తాను రూ.235- 240కు అందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బస్తాపై రూ.30 పెంచి రూ.260- 270లకు అందించనున్నట్లు వెల్లడించింది.

home construction
పేదోడి ఇంటిపై ధరల బరువు

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15.60 లక్షలు, రెండో విడతగా 1.80 లక్షల గృహాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో ఇంటిని 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 50వేల గృహాలు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం 440 కిలోల ఇనుము, 90 బస్తాల సిమెంటు ఇస్తోంది. నిర్మాణపరంగా మరికొంత అవసరమైన వారికి గత నెల నుంచి 140 బస్తాల సిమెంటు అందిస్తోంది. వీటిపై ప్రభుత్వ ధరల ప్రకారం వచ్చే మొత్తాన్ని కేంద్రం ఇచ్చే రూ.1.80 లక్షల రాయితీ నుంచి మినహాయిస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఇనుముపై టన్నుకు దాదాపు రూ.16వేల నుంచి రూ.18వేలు పెరిగింది. ఇంటికి ఇస్తున్న 440 కిలోల ప్రకారం లెక్క కడితే ఒక్కో లబ్ధిదారుడిపై సుమారు రూ.8వేల భారం పడింది. సిమెంటు బస్తాపై రూ.30 పెంచి లెక్కిస్తే 90 బస్తాలకు రూ.2,700, 140 బస్తాలు తీసుకుంటే రూ.4,200 అదనంగా మోయాల్సిందే. కొందరు లబ్ధిదారులు ప్రభుత్వ నిర్దేశిత విస్తీర్ణంలోనే కాస్త మెరుగ్గా కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మరో 100 బస్తాల సిమెంటు, టన్ను ఇనుము అవసరమవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సిమెంటు బస్తా రూ.380-400 వరకు పలుకుతోంది. టన్ను ఇనుము రూ.70 వేలుగా ఉంది. నాణ్యంగా కట్టుకోవాలనుకుంటే.. అదనంగా అవసరమయ్యే సిమెంటు, ఇనుముకు బహిరంగ మార్కెట్‌లో కొనుక్కోవడానికి మరో రూ.55వేల రూ.60వేల వరకు భారం పడుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

గోదాముల నిర్వహణ ఛార్జీలూ పేదల నుంచే..: సిమెంటు, ఇనుము నిల్వ చేసే గోదాముల నిర్వహణ ఛార్జీని లబ్ధిదారుల నుంచే వసూలు చేస్తుండటం గమనార్హం. ఇనుముపై కిలోకు రూ.1.50 చొప్పున 440 కిలోలకు రూ.660 లబ్ధిదారులే భారం మోయాల్సి వస్తోంది. సిమెంటు బస్తాపై రూపాయి చొప్పున 90 బస్తాలు తీసుకుంటే రూ.90, 140 బస్తాలు తీసుకుంటే రూ.140 కట్టాల్సిందే. మొత్తంగా ఈ రూపంలో రూ.750-800 వరకు లబ్ధిదారుల రాయితీ నుంచే మినహాయిస్తున్నారు.

ముగిసిన ఇనుము సరఫరా గడువు: ప్రస్తుతం టన్ను ఇనుము రూ.72-74 వేలతో కంపెనీలు సరఫరా చేస్తున్న గడువు మంగళవారంతో ముగియనుంది. వర్షాకాలం నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో ఇనుము ధర తగ్గుతుందని, ఆ మేరకు జూన్‌ నెలాఖరులో మళ్లీ టెండర్లు పిలిచి జులై నుంచి సరఫరా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.