ETV Bharat / city

PENSION PROBLEMS: పింఛన్‌ కావాలంటే.. అర్హత చూపాల్సిందే!

author img

By

Published : Sep 14, 2021, 7:19 AM IST

రాష్ట్రంలో అందించే పింఛన్​లను తనిఖీ చేస్తున్న ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా లేని వారికి తాఖీదులు జారీ చేస్తోంది. గత నెలలో బియ్యం కార్డుకు ఒకే పింఛన్, ఆ తర్వాత ఆధార్​ కార్డులో వయసు తేడాలు ఉన్నాయంటూ పింఛన్​దారులకు తాఖీదులు ఇస్తోంది.

inquiries-to-pensioners-in-the-state
పింఛన్‌ కావాలంటే.. అర్హత చూపాల్సిందే!

పింఛన్‌ దారులకు తాఖీదులు

వైఎస్సార్‌ పింఛను కానుక కింద లబ్ధిదారులకు అందించే సామాజిక భద్రత పింఛన్లను తనిఖీ చేస్తున్న ప్రభుత్వం.. నిబంధనలకు అనుగుణంగా లేని వారికి తాఖీదులు జారీ చేస్తోంది. గత మూడు నెలలుగా వివిధ పింఛన్లను తనిఖీ చేస్తూ ఏ మాత్రం అనుమానం ఉన్నా సాయాన్ని నిలిపేస్తోంది. గత నెలలో ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను విధానాన్ని అమలు చేసి రెండు పింఛన్లు ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఆధార్‌ కార్డులో వయసు తేడాలు ఉన్నాయంటూ మరికొందరికి అదే నెల తాఖీదులు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆరంచెల తనిఖీ వ్యవస్థకు అనుగుణంగా లేవంటూ లబ్ధిదారులకు వాలంటీర్లు తాఖీదులు ఇస్తున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ఈ జాబితాను క్షేత్రస్థాయికి పంపి లబ్ధిదారుల నుంచి అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు సేకరించారు. ఇంకా ఇవ్వని వారికి తాఖీదులు ఇస్తున్నారు.

లబ్ధిదారుల పేరు మీద తాఖీదులు..

వివిధ రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల పేరు మీద తాఖీదులు ఇస్తున్నారు. 2019 డిసెంబర్‌ 13వ తేదీన జారీ చేసిన 174 ఉత్తర్వులోని పింఛను నిబంధనలకు అనుగుణంగా లేనట్లు గుర్తించి తాఖీదు ఇస్తున్నారు. ‘పింఛను సంఖ్యను నమోదు చేసి మీ వ్యక్తిగత/కుటుంబ వివరాలు పరిశీలించాం. దారిద్య్రరేఖకు ఎగువగా ఉన్న కుటుంబం లేదా భూమి ఎక్కువగా ఉంది లేదా 300 యూనిట్ల కంటే అధిక విద్యుత్తు వినియోగం లేదా బియ్యం కార్డు లేకపోవడాన్ని గుర్తించాం. ఆ మేరకు పింఛను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. తాఖీదు అందుకున్న 7 రోజుల్లో మీ వివరణ రాత పూర్వకంగా తెలియజేస్తూ సంబంధిత పత్రాన్ని మండల కార్యాలయానికి అందించాలి. మీరు పింఛను పొందేందుకు ఉన్న అర్హతను తగు ఆధారాలతో నిరూపించుకోవాలి. లేకపోతే శాశ్వతంగా రద్దు చేస్తాం’ అని తాఖీదుల్లో పేర్కొన్నారు. వీటిని ఎంపీడీవో నుంచి జారీ చేసినట్లు ఉన్నా సదరు అధికారి సంతకం మాత్రం లేదు. సిస్టమ్‌ నుంచి వెలువడటంతో సంతకం అవసరం లేదని తాఖీదుల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: TDP PROTEST: రైతు సమస్యలపై తెలుగుదేశం పోరుబాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.