ETV Bharat / city

Urad price: మింగుడుపడని మినుము.. రైతు గడప దాటాక..!

author img

By

Published : Aug 5, 2022, 9:01 AM IST

Urad price
మింగుడుపడని మినుము

Urad price: రైతులు పండించిన సమయంలో స్థిరంగా ఉన్న మినుముల ధర.. వారి చేయి దాటాక అమాంతంగా పెరిగిపోతోంది. మార్కెట్​లో డిమాండ్​ క్రమంగా ఎగబాకుతోంది. దీనివల్ల వ్యాపారులు, దళారులు లాభాల బాట పడుతున్నారు. కానీ చమటోడ్చి పండించిన రైతులు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నారు. కేవలం రెండు నెలల్లోనే రూ.1,700 ధరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Urad price: మార్కెట్‌లో మినుముల ధర రోజురోజుకూ పెరుగుతోంది. రైతుల వద్ద ఉన్నప్పుడు స్థిరంగా ఉన్న ధర.. వారి గడపదాటాక ఎగబాకుతోంది. రబీలో దిగుబడులు వచ్చే పాలిష్‌ రకం మినుములు మార్చిలో క్వింటా రూ.6,500 పలకగా.. ప్రస్తుతం రూ.8,700 ఉంది. మే ప్రారంభంలో క్వింటా రూ.7,000 ఉన్నప్పుడు ఎక్కువ మంది రైతులు అమ్ముకున్నారు. 2నెలల్లోనే క్వింటా రూ.1,700 వరకు రైతులు నష్టపోయారు. ఖరీఫ్‌ సాగు ఆలస్యం కావడం, వేసిన పంట అధిక వర్షాలకు దెబ్బతినడం, రైతులు పత్తి, సోయాబీన్‌ వైపు మొగ్గు చూపడంవంటి కారణాలతో ప్రస్తుతం మినుముల లభ్యత తగ్గింది.

దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణలలో ఖరీఫ్‌లో మినుము వేస్తారు. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు లేక సాగు ఆలస్యమైంది. తర్వాత అధిక వర్షాలతో పంట దెబ్బతింది. దీంతో గతేడాది నిల్వలు లేవు. దీనికితోడు పత్తి, సోయాబీన్‌కు ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలవారు వాటి సాగుపైనే శ్రద్ధ చూపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రబీలో మినుము వేస్తారు. ఇందులో ఎక్కువగా పాలిష్‌ రకం ఉంటుంది. ఈ ఏడాది సుమారు లక్షన్నర టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 70శాతం రైతులు ఇప్పటికే విక్రయించారు. మరో 10శాతం విత్తన అవసరాలకు ఉంచుకోగా.. 20శాతమే రైతుల వద్ద ఉన్నాయి. రైతులనుంచి కొన్న వ్యాపారులు సైతం క్వింటా రూ.7500నుంచి రూ.8వేల మధ్య విక్రయించారు. మార్కెట్‌ అంచనా వేసిన కొద్ది మంది వ్యాపారుల వద్దే నిల్వలున్నాయి.

దిగుమతులపైనే ఆధారం: గతేడాది పంట దెబ్బతినడంతో మన వద్ద నిల్వలు లేవు. ప్రస్తుతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మియన్మార్‌ ఎగుమతుల్లో 80శాతం మన దేశమే దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ విపణిలో ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో మన దేశంలో ఉన్న కొరతను గుర్తించిన అక్కడి వ్యాపారులు బెట్టు చేస్తూ ధరలు తగ్గించడం లేదు. అక్కడినుంచి కొని మన దేశానికి దిగుమతి చేసుకోవడానికి క్వింటా రూ.8700 వరకు అవుతోంది. జులైనాటికి దేశంలో నిల్వలు తగ్గడంతో ఈ ధరలు కూడా పెరుగుతున్నాయి. సెప్టెంబరులోనూ అధిక వర్షాలు కురుస్తాయన్న అంచనాలు మినుము దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.