ETV Bharat / city

"కరవు నేలలో... ఇక సిరుల పంటలే..."

author img

By

Published : Dec 26, 2019, 1:07 PM IST

in-famine-soil-kaleshwaram
in-famine-soil-kaleshwaram

దశాబ్దాల ఆశలు, ఆకాంక్షల కల సాకారమయ్యే తరుణం వచ్చింది. ఏళ్ల తరబడి బీడువారి నోళ్లు తెరిచిన నేలపై గోదారమ్మ ఉరకలు వేయనుంది. సాగునీరు లేక బోసిపోయిన ప్రాంతాల్లో గంగమ్మ పొంగిపొర్లనుంది. ఉత్తర తెలంగాణ పంట పొలాలను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వర జలాలు గలగలమంటూ ముగింట్లోకి రాబోతున్నాయి. వాయువేగంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మహా సంకల్పం నెరవేరబోతోంది.

"కరవు నేలలో.. ఇక సిరుల పంటలే..."

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గోదావరి జలాలను మధ్యమానేరు దిగువకు తరలించేందుకు వీలుగా పనులు పూర్తయ్యాయి. అనంతగిరి, రంగనాయక్ సాగర్ జలాశయాలతో పాటు సంబంధిత పంప్ హౌజ్​లు సిద్ధమయ్యాయి.

మధ్యమానేరు నుంచి అనంతగిరి వరకు...
మధ్యమానేరు నుంచి నీరు విడుదల చేస్తే వాటిని ఎత్తిపోసేందుకు అవసరమైన తుదిసన్నాహాలు కొనసాగుతున్నాయి. కరవుతో అల్లాడే సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లోని భూములు త్వరలోనే గోదావరి జలాలతో తడవనున్నాయి. త్వరలో నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో మధ్యమానేరు దిగువన పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఫలించిన భగీరధ ప్రయత్నం
సముద్రంలోకి వృథాగా పోతున్న ప్రాణహిత, గోదావరి జలాలను ఒడిసిపట్టి పంటపొలాల్లోకి మళ్లించే ధ్యేయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. ప్రాజెక్టు మొదటి లింక్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి... ఎల్లంపల్లి వరకు జలాల ఎత్తిపోతను ఇప్పటికే ప్రారంభించారు. అక్కడి నుంచి మధ్యమానేరు వరకు జలాలను విజయవంతంగా తరలించారు.

మధ్యమానేరు - పనుల పురోగతి

  1. ప్రస్తుతం ముధ్యమానేరు శ్రీరాజరాజేశ్వర జలాశయం నిండా నీటితో కలకలలాడుతోంది. సిరిసిల్ల వరకూ జలాలు తాకుతున్నాయి. ఇక తదుపరి దశలోనూ నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
  2. కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా అతిపెద్ద సర్జ్‌ పూల్​ నిర్మించారు. మధ్యమానేరు నుంచి కాల్వలు, సొరంగమార్గాల ద్వారా వచ్చే జలాలను ఇక్కడ నిల్వ చేస్తారు.
  3. అనంతగిరి జలాశయంలోకి నీటిని తరలించేందుకు పదో ప్యాకేజీలో భాగంగా అన్నపూర్ణ పంప్ హౌస్ నిర్మించారు. సర్జ్ పూల్ లో నిల్వ చేసిన నీటిని భారీ పంపులు భూగర్భం నుంచి 101 మీటర్ల పైకి ఎత్తిపోస్తాయి.
  4. ఎక్కువ ఖర్చు లేకుండా, ముంపు తక్కువగా ఉండేలా అనంతగిరి జలాశయం నిర్మించారు. కొండ మధ్యే ఈ జలాశయాన్ని నిర్మించారు. జలాశయం కోసం నాన్ ఓవర్ ఫ్లో డ్యాం వాల్స్‌ను, మట్టితో కట్ట నిర్మించారు. అనంతగిరి జలాశయం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, బెజ్జంకి మండలాలకు చెందిన 30వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
  5. మధ్యమానేరు నుంచి తరలించే నీటిని అనంతగిరి జలాశయం నుంచి రంగనాయకసాగర్ పేరిట నిర్మించిన ఇమాంబాద్ జలాశయానికి మరో దశలో తరలిస్తారు.
  6. పదకొండో ప్యాకేజీలో పంపులకు నీరందించేందుకు భూగర్భంలోనే సర్జ్ పూల్ నిర్మించారు. కాల్వలు, ఎనిమిదిన్నర కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా వచ్చిన నీటిని ఇక్కడ నిల్వ చేసి పంపులకు సరఫరా చేస్తారు.
  7. అనంతగిరి జలాశయం నుంచి వచ్చే జలాలను ఎగువకు ఎత్తిపోసేందుకు పదకొండో ప్యాకేజీలో భాగంగా భూగర్భంలో మరో పంప్ హౌజ్ నిర్మించారు. 117 మీటర్ల ఎత్తుకు ఇక్కడి పంపులు నీటిని ఎత్తిపోస్తాయి.

రంగనాయకసాగర్ జలాశయం
వరుస జలాశయాల్లో భాగంగా సిద్దిపేట సమీపంలో మరో జలాశయం సిద్ధమైంది. రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. జలాశయం చుట్టూ బీటీ రహదార్ల నిర్మాణం కూడా పూర్తైంది.

పర్యాటకానికి ప్రత్యేక ప్రణాళిక
"కేవలం సాగునీరే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలోనే ఉన్నందున దీన్ని పర్యాటకప్రాంతంగా రూపుదిద్దే ప్రణాళికలను కూడా ఇప్పటికే ప్రారంభించారు"

కొమురెల్లి మల్లన్న చెంతకు గోదారమ్మ
రంగనాయక్ సాగర్ నుంచి తదుపరి దశలో నీటిని కొమురెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర జలాశయాలకు తరలిస్తారు. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంది.

"ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు మూడో టీఎంసీ, మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు రెండో టీఎంసీ ఎత్తిపోసేందుకు అవసరమైన అదనపు పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు"


ఇవీ చదవండి:

గ్రహణం వేళ.. శ్రీకాళహస్తీశ్వరుడికి భక్తుల పూజలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.