ETV Bharat / city

"సర్కారు వారి సినిమా"కు.. హైకోర్టు చెక్!

author img

By

Published : Jul 1, 2022, 10:58 AM IST

Updated : Jul 1, 2022, 12:38 PM IST

movie tickets
movie tickets

10:54 July 01

ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

HIGH COURT STAY: "సర్కారు వారి సినిమా"కు న్యాయస్థానం చెక్ పెట్టింది. సినిమా టికెట్లను ఆన్ లైన్లోనే విక్రయిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను.. హైకోర్టు నిలిపేసింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 69ని సవాల్ చేస్తూ.. బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎగ్జిబిటర్లు దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన న్యాయస్థానం.. జీఓ అమలుపై స్టే విధించింది. తుది విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.

ఎన్నో వివాదాలు : 2021 ఏప్రిల్ 9న.. పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అప్పటి వరకూ సినిమా టికెట్ల మీద ఎలాంటి ప్రకటనా చేయని ప్రభుత్వం.. సినిమా విడుదలకు ముందు రోజు రాత్రే హడావిడిగా సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా.. ఏ థియేటర్లో ఎంత ధర వసూలు చేయాలో నిర్దేశించింది. అప్పటి వరకూ కరోనా కారణంగా నెలల తరబడి థియేటర్లు మూసేశారు. అలాంటి పరిస్థితుల్లో.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ నుంచి విస్మయం వ్యక్తమైంది. ఈ ధరలకు షోలు వేస్తే గిట్టుబాటు కాదంటూ ఎగ్జిబిటర్లు చేతులు ఎత్తేశారు. ఉన్నట్టుండి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందన్న ప్రశ్నకు.. రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేందుకే ఇలా చేశారని జనసేన, బీజేపీ నాయకులతోపాటు పవన్ అభిమానులు ఆరోపించారు. అప్పటి నుంచి మొదలైన సినిమా టికెట్ల వివాదం.. టీవీ సీరియల్ మాదిరిగా నెలల తరబడి కొనసాగింది.

చర్చోప చర్చలు : ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు అమాంతం తగ్గించడంతో.. థియేటర్లో సినిమా విడుదల చేసేందుకు చాలా కాలంపాటు నిర్మాతలెవరూ ధైర్యం చేయలేకపోయారు. తెలుగు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారంటూ వార్తలు వచ్చినా.. చాలా కాలంపాటు అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం తానే సినిమా టికెట్లు అమ్ముతానంటూ ప్రకటించింది. థియేటర్లలో ఇష్టమొచ్చిన ధరకు టికెట్లు అమ్మడం ద్వారా.. సామాన్యుడికి వినోదం కాస్ట్ లీ అయ్యిందని చెప్పిన ప్రభుత్వం.. ఆన్ లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తామని వెల్లడించింది. ఈ మేరకు జీఓ నెంబర్ 69 కూడా విడుదల చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి సినీ ప్రముఖులు సీఎం జగన్ తో సమావేశమై.. టికెట్ రేట్లపై చర్చించారు. బడ్జెట్ ఆధారంగా కొన్ని సినిమాలకు టికెట్ ధరల్లో మినహాయింపు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. అమ్మకం మాత్రం తమనుంచే జరుగుతుందని చెప్పింది.

కోర్టు మెట్లెక్కారు : ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మడంపై.. ఆది నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. జనసేనాని పవన్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ఆదాయంగా చూపుతూ.. అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందని, అందుకే ఆన్ లైన్ విక్రయ విధానాన్ని తెచ్చిందని ఆరోపించారు. ఇలా నలుగుతున్న వివాదంపై.. బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేయలేమని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఆమోద యోగ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. విచారించిన కోర్టు.. ప్రభుత్వం తెచ్చిన జీఓ69ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తుది విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : ఇప్పటికే పలుమార్లు కోర్టులో ఎదురుదెబ్బలు తగిలిన రాష్ట్ర ప్రభుత్వానికి.. తాజాగా సినిమా టికెట్ల విక్రయం విషయంలోనూ చుక్కెదురైంది. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని కోర్టు చెప్పడంతో.. ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరి, తుది తీర్పులో న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుంది? ఈ విషయంలో సర్కారు ఎలాంటి విధానంలో ముందుకెళ్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.