ETV Bharat / city

rains in ap: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

author img

By

Published : Sep 3, 2021, 10:21 AM IST

Updated : Sep 3, 2021, 11:22 AM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

heavy
heavy

rains in ap: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. తలుపుల మండలంలో 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. తలుపుల మండలం చిన్నపల్లి, మాడికవాండ్లపల్లి చెరువు కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రమైన తలుపులలోని పలు కాలనీలు నీట మునిగాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

కొట్టుకుపోయిన కారు..

తలుపుల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి చిన్న పల్లి కదిరి పులివెందుల ప్రధాన రహదారి ఒదులపల్లి వద్ద వరద నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మృతి చెందారు. మృతుడు కదిరి పట్టణ మూర్తి పల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా కుమారుడిగా గుర్తించారు. ప్రమాదంలో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో కదిరి పులివెందుల మధ్య రాకపోకలు స్తంభించాయి.

కడప జిల్లాలో..

కడప జిల్లా పులివెందుల మండలం మొట్నూతల పల్లె గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓడలపల్లె వద్ద ఆర్​డీపీ చెరువు తెగిపోవడంతో చెరువులో ఉన్న నీరంతా పులివెందుల కదిరి మార్గంలోని ని నామాలగుండు మీదుగా పులివెందుల మండలం మొట్నూతల పల్లి గ్రామానికి చేరింది. దీంతో కణం పల్లె గ్రామాల్లోని వందల ఎకరాల్లో అరటి, చీనీ, కూరగాయల పంటలు నీటిపాలైంది. దీంతో తమను ఆదుకోవాలని కనం పల్లె, మొట్నూతల పల్లె గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొట్నూతల పల్లె గ్రామంలో దాదాపు 20 పశువులు నీటి ఉద్ధృతికి బలై పోయాయని, కోళ్లు, మూడు ఎద్దుల బండ్లు, మూడు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ...

విజయవాడ వన్ టౌన్ చిట్టీనగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండిపోయి ప్రధాన రోడ్లపైకి వదర నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో అరగంట పాటు వాహనచోదకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగిపొర్లుతుంది. దీంతో చెవిటికల్లు - కంచికచర్ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చందర్లపాడు మండలం పాటెంపాడు సమీపంలోని గుర్రాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నందిగామ నియోజక వర్గంలో రాత్రి భారీ వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరులో కుండపోత వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి భారీ వర్షానికి అనేక కాలనీలోకి నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ డిపో, కలెక్టరేట్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ఆర్ పేట ప్రధాన కూడళ్లలో మూడు నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఆర్ఆర్ పేట కాలనీలో నీరు నిలవడంతో ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షం కావడం వర్షపు నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నగరంలో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలుస్తోందని ప్రజలు అంటున్నారు. భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది.

కర్నూలు జిల్లా..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా మినుము, మొక్కజొన్న పంటలు వందలాది ఎకరాల లో మునిగిపోయాయి.

కొనసాగుతున్న రుతుపవన ద్రోణి..

గుజరాత్​లోని ఓఖా, సూరత్​ల నుంచి విదర్భ - గోపాల్​పూర్​ల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు గుజరాత్ నుంచి కోస్తాంధ్ర వరకూ సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మిర్చి పంట భారీగా నీట మునిగాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: AP UNEMPLOYMENT RATIO: దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నిరుద్యోగం.. ఏపీలో 6.5, తెలంగాణలో 4.7 శాతం

Last Updated : Sep 3, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.