ETV Bharat / city

ఏపీలో భారీ వర్షాలు.. వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు

author img

By

Published : Sep 15, 2020, 5:21 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు.. పొంగి పొర‌్లుతున్నాయి. భారీ వర్షాలకు 7జిల్లాల పరిధిలో.. సుమారు 60వేల హెక్టార్లలో పంటలు నీటమునిగినట్లు.. ఏపీ వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు దెబ్బతిన్నాయని.. వ్యవసాయశాఖ తెలిపింది. కర్నూలు,కడప జిల్లాల్లో వానలకు కుందూనదిలో 35వేలక్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.

ap rains
ap rains

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కృష్ణా జిల్లా గంపలగూడెంలో కట్టలేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు వాగు జలకళ సంతరించుకుంది. చిన్నంపేట, శివాపురం మధ్య వంతెనకు గండిపడింది. దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. తమ్మిలేరు జలాశయానికి సుమారు 5 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టి చెరుకూర్లలో రాత్రి నుంచి వాన పడుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమిత మయ్యారు. పొలాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో మిర్చి, పత్తి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు తూర్పుగోదావరిలోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. ముంపు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అమలాపురంలోనూ జోరు వానలు పడుతున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలకు ప్రత్తిపాడులో ఏలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 13 వేల క్యూసెక్కులకు పైగా నీటిని కిందికి విడిచిపెడుతున్నారు. కిర్లంపూడి, రాజుపాలెం, గొల్లప్రోలులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది.

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి బుదగవి చెరువు పొంగిపొర్లుతోంది. వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యూలేటర్ ద్వారా 50 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. జలాశయం నుంచి ఉత్తర, దక్షిణ కాల్వల ద్వారా 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

భారీ వర్షాలకు 7జిల్లాల పరిధిలో.. సుమారు 60వేల హెక్టార్లలో పంటలు నీటమునిగినట్లు.. ఏపీ వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు దెబ్బతిన్నాయని.. వ్యవసాయశాఖ తెలిపింది.

కర్నూలు, కడప జిల్లాల్లో వానలకు కుందూనదిలో 35వేలక్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. పెన్నాలోనూ వరద పోటెత్తింది. తూర్పుగోదావరి జిల్లాలో 66 గ్రామాల పరిధిలో.. 13వేల 400 ఎకరాల్లో వరి, 355 ఎకరాల్లో పత్తి దెబ్బతింది. పశ్చిమగోదావరి జిల్లాలో.. 19 మండలాల పరిధిలో 20 వేలు, కర్నూలు జిల్లాలో 13వేలు, గుంటూరు జిల్లాలోని... ఆరు మండలాల్లో 8వేలు, కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 4వేల ఎకరాల్లో.. పంట పాడైంది. కృష్ణా జిల్లాలో.. సుమారు 300 చెరువులు నిండు కుండల్లా మారాయి. నెల్లూరు జిల్లాలో చేతికందొచ్చిన వరి నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి: 'ఏ భాషను బలవంతంగా రుద్దకూడదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.