ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షాలు

author img

By

Published : Apr 9, 2020, 8:43 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వానలు... రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. పిడుగుపాట్లకు పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. నిత్యావసరాల కోసం రోడ్లపైకి వచ్చిన జనం వర్షపు నీటి వల్ల ఇబ్బందులకు గురయ్యారు.

heavy-rains-in-ap
heavy-rains-in-ap

రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. కృష్ణాజిల్లాలో అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆరు బయట ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న గింజలు నీటిపాలవ్వడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మోపిదేవి మండలం చిరువోలులో పిడుగుపాటుకు ఓ గడ్డివాము దగ్ధమైంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగిడిపాలేనికి చెందిన ఓ రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు. పంట తడవకుండా పట్టాలు వేస్తుండగా పిడుగుపడటంతో.. రైతు అక్కడికక్కడే మరణించాడు. చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో.... పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు.

నెల్లూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమై... ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. నాయుడుపేట సహా పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఉదయగిరిలో గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. బోగోలు మండలం కండ్రిగలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందాడు. జిల్లాలో వేర్వేరుచోట్ల పిడుగుపాట్లకు మరో ఆరుగురు మృతి చెందారు.

అకాల వర్షాలు ఉభయగోదావరి జిల్లాలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. మామిడి, జీడిమామిడి, అరటి, మొక్కజొన్న సహా పలు పంటలను వానలు నిండా ముంచేశాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడం, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మొక్కజొన్న నేలరాలాయి. జంగారెడ్డిగూడెం పరిధిలో సుమారు వెయ్యి హెక్టార్లలో మామిడి కాయలు నేలరాలాయి. 500 హెక్టార్లలో అరటి నేలకూలింది. మొక్కజొన్న, వడ్లు పొలాల్లోనే తడిసిముద్దయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షాలకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. రబీ వరి కోతలు జరుగుతున్న సమయంలో కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో పిడుగుపాటుకు ఓ రైతు మరణించాడు. చీరాల, పర్చూరు, అద్దంకి, పొదిలి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై నీరు నిలిచాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కడప జిల్లా చిట్వేలు మండలం తిరుమలశెట్టిపల్లెలో ఈదురుగాలుల ధాటికి అరటి తోటలు నేలమట్టమయ్యాయి. తిరుపతిలో గంటపాటు ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రధాన రహదారులు, వీధులన్నీ జలమయమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.