ETV Bharat / city

అల్పపీడన ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షం

author img

By

Published : Jun 11, 2020, 6:22 PM IST

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఉదయం నుంచి వానలు పడుతున్నాయి. అల్పపీడనం మరింత బలపడి.. రెండ్రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. రైతులు, గొర్రెల కాపర్లు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అల్పపీడన ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం..
అల్పపీడన ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం..

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులవరకు ఎండలో అల్లాడిన జనం.. ప్రస్తుతం వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని ఈ ప్రభావంతో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండ్రోజుల వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.

కర్నూలులో...

అల్పపీడన ప్రభావంతో కర్నూలులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో 2 రోజులుగా ఒక మోస్తరు వర్షం కురుస్తున్న కారణంగా.. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలకరి వర్షాల రాకతో.. సాగుకు సమాయత్తమవుతున్నారు. నంద్యాలలోనూ భారీ వర్షం కురిసింది. ఇన్నాళ్లు ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు వర్షాలతో ఉపశమనం పొందారు.

చిత్తూరులో..

చిత్తూరు జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. జల్లులతో కొండపై పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారాయి. సుదీర్ఘ విరామం తర్వాత స్వామిని దర్శించేందుకు వచ్చిన యాత్రికులు వర్షంలో తడుస్తూనే శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు.

కోస్తా జిల్లాల్లో...

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నగరంతో పాటు ఆమదాలవలస, గార, పోలాకి, నరసన్నపేట, రేగిడి, కొత్తూరు, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో వాన పడింది. మిగిలిన చోట్ల చిరుజల్లులు కురిశాయి. విజయనగరం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలు కురవడంపై రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లాలో...

కడపలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. రైతులు పొలాలను సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురవడంపై రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పీజీ వైద్య విద్య విద్యార్థుల పిటిషన్​పై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.