ETV Bharat / city

RAINS IN AP: రాష్ట్రంలో కుండపోత.. నేడు, రేపూ పలు చోట్ల భారీ వర్షాలు

author img

By

Published : Jul 10, 2022, 7:33 AM IST

RAINS IN AP: రాష్ట్రంలో కుండపోత వాన కురుస్తోంది. దాంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షం పడింది. భారీ వర్షాలతో జలశయాలకు వరద నీరు విపరీతంగా వచ్చి చేరుతోంది. వర్షాలు, వరదల ప్రభావం ఉంటే రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూం(1070, 1800 4250101, 0863 237718)ను సంప్రదించాలన్నారు.

RAINS IN AP
RAINS IN AP

RAINS IN AP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షం పడింది. ఇదే జిల్లాలోని గరివిడిలో 17 సెం.మీ, చీపురుపల్లిలో 13, తెర్లాంలో 12, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 14 సెం.మీ వాన కురిసింది. ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు తిరుపతిలోనూ 3 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. శనివారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు ఎత్తారు. సాయంత్రానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లినట్లు గేట్ల పర్యవేక్షణ ఈఈ చెప్పారు. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 1.20లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు.

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంకరేవు వద్ద వశిష్ఠగోదావరి అనుబంధ పాయలోని తాత్కాలిక దారి తెగిపోయింది. 4 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు అడుగుమేర ఎత్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి జలాశయం 2 గేట్లు ఎత్తారు. జలాశయం గట్టు ఓ వైపు కోతకు గురైంది. ఇదే జిల్లాలోని వేగావతి నదికి వరద పోటెత్తడంతో సాలూరు పట్టణానికి 67ఏళ్లుగా క్రమం తప్పకుండా నీరందిస్తున్న తాగునీటి వ్యవస్థ దెబ్బతింది. బాగు చేసేందుకు 3 నుంచి 5రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

తుంగభద్రకు పోటెత్తిన వరద: తుంగభద్ర జలాశయానికి శనివారం సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జలాశయానికి ఒకే రోజులో సుమారు 8 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం 72.951 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిండటానికి ఇంకా 23 టీఎంసీలు అవసరం. ఇప్పటికీ ఎగువ నుంచి వరద భారీగా వస్తోంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేయనున్నట్లు తుంగభద్ర జలాశయ మండలి ఇంజినీర్లు తెలిపారు. ఈ మేరకు నదీ తీర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరికలు జారీచేశారు.

తెలంగాణలో..: శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెలంగాణలో మొత్తం 860 ప్రాంతాల్లో వర్షాలు కురవగా అందులో 34 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. కేవలం 9 గంటల వ్యవధిలో నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో రికార్డుస్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నేడు, రేపూ అక్కడక్కడా భారీ వర్షాలు: ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎండీ డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ తెలిపారు. వర్షాలు, వరదల ప్రభావం ఉంటే రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూం(1070, 1800 4250101, 0863 237718)ను సంప్రదించాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.