ETV Bharat / city

జోరు వానలకు పంటలు నీటిపాలు.. భోరుమంటున్న రైతులు

author img

By

Published : Sep 20, 2020, 9:01 AM IST

Updated : Sep 20, 2020, 10:16 AM IST

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న జోరువానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల నీటమునిగాయి. పలుచోట్ల జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. కొన్నిచోట్ల పంటలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

heavy-rains-continued
జోరు వానలకు పంటలు నీటిపాలు.. భోరుమంటున్న రైతులు

జోరు వానలకు పంటలు నీటిపాలు.. భోరుమంటున్న రైతులు

భారీవర్షాలతో కడప జిల్లా తడిసిముద్దైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాపాఘ్ని నది జలకళ సంతరించుకుంది. పులివెందుల నియోజకవర్గంలో వంకలు, వాగులు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లో కాలనీలు జలమయమయ్యాయి. మల్లెల చెరువు వద్ద వంకల ఉద్ధృతికి రాకపోకలకు నిలిచిపోయాయి. మగమూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మైదుకూరులో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. భారీ వర్షానికి కడపలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హజ్ హౌస్‌లోని కొవిడ్ కేంద్రం చుట్టూ వర్షం నీరు చుట్టింది. కరోనా రోగులు ఇబ్బందులు పడ్డారు. బుగ్గవంక ప్రాజెక్టు నిండింది. నాలుగు గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలారు. వరి పొలాలు నీట మునిగాయి. పార్నపల్లి గ్రామంలో వాగులో చిక్కుకున్న ఒక వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. నల్లచెరువుపల్లెలో పొలానికి వెళ్లిన విద్యార్థి వాగులో పడి మృతిచెందాడు.

కర్నూలు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయి... పంట పొలాలను ముంచెత్తాయి. నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. జిల్లాలో 24 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

వర్షాలకు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో 20వేల ఎకరాలు వరి పంట నీటమునిగింది. సంగం వద్ద ప్రవహిస్తున్న బీరాపేగు వాగులో ధాన్యం లారీ, ట్రాక్టర్ ఇరుక్కుపోయాయి. చేజర్ల మండలం ఫుల్లనీలపల్లి గ్రామం సమీపంలో పెన్నానది లో పది మంది చిక్కుకోగా...రక్షణ చర్యలు చేపట్టారు. పెన్నా నదిలో 13 గంటలపాటు వరద ప్రవాహంలో చిక్కుకున్న ఓ వ్యక్తి ని అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు. వరద ఉద్ధృతితో నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నిండుకోగా..వరద నీటిని పెన్నా నది ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 1.60లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో పెన్నా నది తీరం సమీపంలోని గ్రామాల్లోకి నీరు వచ్చిపడుతుంది. ప్రధానంగా సంగం మండలంలోని వీర్ల గుడిపాడు గ్రామం మునకకు గురి అయ్యింది. కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలతో గ్రామస్థులను రాత్రి బోట్లు సహాయంతో బైటకు తరలించారు. తమను ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామన్ననెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు...నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు ఎదురైతే 104, 1077 నంబర్లకు కాల్ చేయవచ్చునన్నారు.

భారీ వర్షంతో విశాఖ నగరం తడిసిముద్దైంది. ప్రకాశం జిల్లా కంభం చెరువు జలకళ సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు చెరువు క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. చెరువు చూసేందుకు చుట్టూ ప్రక్కల జనం తరలివస్తున్నారు.

ఇవీ చూడండి...

శ్వేతసౌధంలో కలకలం.. ట్రంప్​కు పార్సిల్​లో విషం

Last Updated : Sep 20, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.