ETV Bharat / city

జలాశయాలకు వరద ప్రవాహం.. గేట్లు ఎత్తి నీటి విడుదల

author img

By

Published : Oct 8, 2022, 10:33 AM IST

FLOODS TO RESERVIORS
FLOODS TO RESERVIORS

FLOODS TO RESERVIORS : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులు నిండుకుండలను తలిపిస్తున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

SRISAILAM : భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది. ప్రస్తుతానికి ప్రాజెక్టు నుంచి 5 గేట్లను 10అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 66,202 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 212.91 టీఎంసీలుగా ఉంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1.47 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.

సోమశిల : నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద కొనసాగుతోంది. కర్నూలు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలకు 36 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టుకు వస్తోంది. సోమశిల నుంచి పెన్నా ద్వారా 35 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 70 టీఎంసీల సామర్థ్యంతో సోమశిల జలాశయం నిండు కుండలా మారింది. పెన్నా పరివాహక‌‌ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు జారీ చేశారు.

రైవాడ జలాశయం : ఎగువన కురిసిన వర్షాలతో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దేవరాపల్లి మండలం రైవాడ నుంచి శారదా నదిలోకి 2 గేట్లు ఎత్తి 6వేల500 క్యూసెక్కుల వరదను వదిలారు. మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి నదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. చీడికాడ మండలంలోని కోనాం జలాశయం నుంచి దిగువ బొడ్డేరు నదిలోకి భారీగా వరదను వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.