ETV Bharat / city

కొత్త ఆశయాలు, ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

author img

By

Published : Jan 1, 2021, 7:42 AM IST

Happy New Year to all ETV bharath viewers
కొత్త ఆశయాలు,ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

కాలగర్భంలో మరో ఏడాది గడిచి పోయింది. నూతన సంవత్సరానికి ఏంతో ఉత్సహంగా స్వాగతం పలుకుతున్నారు. 2020లో ఏన్నో సమస్యలతో సతమతమైన ప్రజలకు.. ఈ నూతన ఏడాది అంతా శుభం జరుగుతుందని ఆశిస్తున్నారు. 2021లో ప్రజలందరు నూతన ఉత్సాహాంతో ముందుకు సాగాలని కోరుకుంటూ... ఈటీవి భారత్​ వీక్షకులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

వెలుగు చీకట్లతో కాలం కరుగుతుంటుంది. మబ్బులు ముసురుతాయి. హరివిల్లు మెరుస్తుంది. తొలకరి చినుకులు పుడమి పొత్తిళ్లలోకి ఒదిగిపోతాయి. నేలలో జల్లిన విత్తనం చిట్లి మట్టిపొరల్ని చీల్చుకొని నింగివైపు చూస్తుంది. అంకురం మొక్క అవుతుంది. మొక్క మానుగా ఎదుగుతుంది. పూలు, కాయలు, ఫలాలు అందిస్తుంది. కాలచక్ర భ్రమణంలో ఎన్నో విన్యాసాలు. రుతువుల మార్పుతో మనిషి జీవన గమనంలోనూ మార్పులు అనివార్యం.
కాలమనే నిరంతర ప్రవాహంలో... ఎన్నెన్నో సుడులు, మలుపులు. ఒక చోట సెలయేరులా పరుగెత్తితే, మరోచోట జలపాతంలా దూకుతుంది. ఇంకోచోట పిల్ల కాలువ అవుతుంది. మనిషి జీవితమూ అంతే. కాలగతిలో కొన్ని గాయాలు వాటంతట అవే మానిపోతాయి. మానసిక వ్యధను ఉపశమింపజేసే శక్తి కాలానికే ఉంది.

జయాపజయాల సంగమం ఈ జీవితం..

భారతీయ చింతన ప్రకారం కాల విభజన, కాల గణన అనేవి మనిషి జయాపజయాలను సమీక్షించుకొని పునరుత్తేజం పొందడం కోసమే. గతాన్ని విశ్లేషించుకొని, వర్తమానంలో జీవిస్తూ, భవిష్యత్తును అంచనా వేసుకోవడం మనిషి కర్తవ్యం. ఏ మనిషైనా వెనక్కు తిరిగి చూస్తే ఎన్నో విజయాలు అపజయాలు, లాభాలు నష్టాలు, కొన్ని మెరుపులు కొన్ని మరకలు కనిపిస్తాయి.

సుఖదుఃఖాల సాగారాల మజిలి చేరక తప్పదు..
సుఖదుఃఖాలు కలిసికట్టుగా రావు. బండిచక్రం పైభాగం కిందికి, కింది భాగం పైకి వస్తూ ఏ విధంగా తిరుగుతుంటుందో సుఖదుఃఖాలూ అంతే. ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం మానవ నైజం. జీవితం జీవ నది. ముందుకు పోతూనే ఉంటుంది. నిన్నటిలా ఈ రోజు ఉండదు. నేటిలా రేపు ఉండకపోవచ్చు. గతాన్ని తలచుకొని పరితపిస్తూ, నిస్తేజంగా ఉండిపోవడం విజ్ఞుల లక్షణం కాదు. వర్తమానం హరిత వృక్షమైతే, గతం జీర్ణ పత్రం లాంటిది.

అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న మానవుడు..
ఆది మానవుడు అణు మొనగాడయ్యాడు. రోదసిలో విహరించాడు. అపార మేధతో అద్భుతాలు ఆవిష్కరించాడు. చేపలా నీట్లో ఈదడం నేర్చుకున్నవాడు, పక్షిలా నింగిలో ఎగరగలుగుతున్నవాడు... నేలమీద ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతున్నాడు. అహంకారంతో విర్రవీగిన మనిషి పరిస్థితులు అనుకూలించకపోతే నైరాశ్యంలో మునిగిపోతాడు. పెను విపత్తో, వైపరీత్యమో సంభవిస్తే తల్లడిల్లిపోతాడు. కటిక పేదవాడికైనా, ఆగర్భ శ్రీమంతుడికైనా జీవితంలో సమస్యలు, సవాళ్లు తప్పవు. అది పరమాత్ముడి లీల. కష్టాల కారు మేఘాలు కమ్ముకున్నప్పుడు మనిషికి ఆశే దీపం. ముసురుకున్న చీకట్లను చీల్చుకుంటూ వెలుగు బాటను వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి.

ఆశావాదం, అనుకూల ఆలోచన- గొప్ప వ్యక్తిత్వానికి సంకేతాలు. నిరాశా నిస్పృహలు, వ్యతిరేకపుటాలోచనలు మనిషిని కుంగదీస్తాయి. మనసును కృశింపజేస్తాయి. దాంతో జీవితం దుఃఖభాజనమవుతుంది. ఆశావాదం మానవ ప్రస్థానానికి కరదీపిక. అనుకూల ఆలోచన మానవ ప్రగతికి పతాక. ‘ఆకులు రాలిపోతేనేమి చిగురాకులు పుట్టవా, నీళ్ళు ఇగిరిపోతేనేమి నీటి మబ్బులు గజ్జెకట్టవా’ అన్న కవి సినారె మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి. మనసును ఉన్నత భావాలతో నింపుతూ, ఉన్నతాదర్శంతో, సదాశయంతో మనం జీవించాలి. మనం బతుకుతూ ఇతరుల్ని బతకనివ్వాలి. శిశిరం నుంచి వసంతానికి, చీకటి నుంచి ప్రభాతానికి, నిరాశ నుంచి ఆశా శిఖరానికి ప్రస్థానం సాగిద్దాం. కొత్త కోరికలతో, కొత్త ఆశలతో కొత్త పొద్దుకోసం ఆరాటపడదాం!

ఇదీ చదవండీ..2021 వచ్చేసింది... కోటి ఆశలతో సుస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.