ETV Bharat / city

పింఛను ఏ నెలకు ఆ నెలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

author img

By

Published : Sep 1, 2021, 4:08 AM IST

ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత పింఛను రెండు నెలలదీ కలిపి ఒకేసారి తీసుకుంటున్నారా..? ఇకపై అది సాధ్యపడదు. రెండు, మూడు నెలలు తీసుకోకున్నా ఆ మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చే విధానాన్ని... ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని వాలంటీర్లకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే వివిధ సాకులతో 3 నెలల్లో 2లక్షల 28 వేల పింఛన్లు నిలిపివేయగా..ఈ కొత్త నిబంధన ఎటు దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

పింఛను ఏ నెలకు ఆ నెలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
పింఛను ఏ నెలకు ఆ నెలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

ఆగస్టులో పింఛను తీసుకోకుండా రెండు నెలలదీ సెప్టెంబరులో తీసుకుందామనుకున్న వారికి ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వలేదు. సెప్టెంబరులో ఒక నెల పింఛనే లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనే ఆదేశాలూ పింఛను పంపిణీకి రెండు రోజుల ముందు ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రభావం లక్ష మంది లబ్ధిదారులపై పడనుంది. వ్యవసాయ పనులకు వలస వెళ్లే వారు... నగరాల్లో పిల్లల వద్ద ఉంటున్న పండుటాకులు, కరోనా వేళ ప్రయాణాలు వద్దని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారూ ఇబ్బందిపడే అవకాశం ఉంది. గతేడాది లాక్‌డౌన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న లక్షా 87 వేల మందికి 6 నెలల మొదలు నెల పింఛను బకాయిలనూ ఒకేసారి అందించారు.

కరోనా ముప్పు తొలగక ముందే ఇప్పుడు ఇలా నిర్ణయించడం లబ్ధిదారులను కలవరపరుస్తోంది. తమ పింఛను ఎక్కడ అందకుండా పోతుందోనని... అర్హులు ఆవేదన చెందుతున్నారు. నెలకోసారి తనిఖీలంటూ పింఛను లబ్ధిదారుల సంఖ్యలో ప్రభుత్వం కోతపెడుతోంది. జూన్‌లో బియ్యం, ఆధార్‌ కార్డుల్లోని మార్పుల ఆధారంగా ఒంటరి, వితంతు పింఛన్లను తనిఖీ చేసింది. జులైలో వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారణ మేరకు ఇచ్చే డయాలసిస్‌, ఇతర పింఛన్లను పరిశీలించింది. దివ్యాంగులవీ పునఃపరిశీలించింది. చనిపోయిన వారి పేరు మీద పింఛను పొందకుండా ఈకేవైసీని నమోదు చేయించింది.

వాలంటీర్ల యాప్‌లో లబ్ధిదారుల హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ను తప్పనిసరి చేసి ఇందులో ఏమాత్రం అనుమానం ఉన్నా వారి లబ్ధినీ నిలిపివేసింది. ఆగస్టులో ‘ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను’నిబంధన అమలు చేసింది. ప్రతి నెలా వివిధ విభాగాల కింద తనిఖీ చేసి, జాబితా కుదిస్తున్నా ఏ విభాగంలో ఎంతమందికి, ఏ కారణం వల్ల పింఛన్లు నిలిపేసింది? అనే వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

సరైన పత్రాలతో అర్హత నిరూపించుకుంటే తిరిగి మంజూరు చేస్తామని మాత్రం చెప్తున్నారు. గత 3 నెలలుగా లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేస్తున్న ప్రభుత్వం వివిధ కారణాలు చూపి 2 లక్షల 28 వేల పింఛన్లను నిలిపేసింది. వీరిలో చనిపోయిన వారూ కొంత మేర ఉన్నా 61 లక్షల 46 వేలు ఉన్న సామాజిక పింఛనుదారుల సంఖ్యను సెప్టెంబరు నాటికి 59 లక్షల18 వేలకు తగ్గించింది. కొత్తగా తెచ్చిన నిబంధనతో ఇంకెంత మందికి కోతపెడతారోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తాం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.