ETV Bharat / city

garbage fee: చెత్తపై రుసుముల వసూళ్లకు సిద్ధం

author img

By

Published : Aug 31, 2021, 7:51 AM IST

చెత్త సేకరణపై వినియోగ రుసుములు వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుకూలంగా తీర్మానించిన పట్టణ స్థానిక సంస్థల అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. రుసుముల వసూళ్ల బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు.

garbage fee
garbage fee

ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుకూలంగా తీర్మానించిన పట్టణ స్థానిక సంస్థల్లో అమలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టుకు సంబంధించిన రుసుముల వసూళ్ల బాధ్యతను వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. కొన్నిచోట్ల అన్ని వార్డులు/డివిజన్లలో, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రుసుముల వసూళ్లకు సిద్ధమయ్యారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా ఇళ్లు, వాణిజ్య సంస్థల్లో రోజూ చెత్త సేకరించినందుకు వినియోగ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ పాలకవర్గాల్లో మొదట భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్నులు విధించాలన్న నిర్ణయంపై ప్రజల్లో అప్పటికే ఆందోళన వ్యక్తం కావడంతో చెత్త సేకరణపై రుసుముల అంశాన్ని పాలకవర్గాలు పలు చోట్ల వాయిదా వేశాయి. ప్రతిపాదనలను ఆమోదించాల్సిందేనని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లడంతో మొదట వ్యతిరేకించిన చోట మళ్లీ పాలకవర్గాలు సమావేశమై అనుకూలంగా తీర్మానించాయి.

అన్ని డివిజన్లలోనూ ఇక చెత్త సేకరణ
నగర పాలక సంస్థల్లో ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో చెత్త సేకరణను ప్రారంభించారు. అలాంటిచోట్ల ఇప్పటికే రుసుము వసూలు చేస్తున్నారు. ఇలాంటిచోట్ల ఇక అన్ని డివిజన్లలోనూ ఇళ్లు, వాణిజ్య సంస్థలనుంచి చెత్త సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్లాప్‌ కార్యక్రమం కోసం ఇప్పటికే తెప్పించిన ఆటోలను అన్ని పట్టణ స్థానిక సంస్థలకూ స్వచ్ఛాంధ్ర సంస్థ త్వరలో కేటాయించనుంది. కార్యక్రమాన్ని సెప్టెంబరులో ప్రారంభించే అవకాశాలున్నాయి. అప్పటినుంచి నగరపాలక సంస్థల్లో అన్ని డివిజన్లలోనూ చెత్త సేకరణ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: appsc:నోటిఫికేషన్లేవీ?...ప్రభుత్వ ఉత్తర్వులు రాక జాబ్ క్యాలెండర్ పై స్తబ్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.