ETV Bharat / city

హైదరాబాద్​లో కష్టంగా మారుతున్న కరోనా మృతుల అంత్యక్రియలు

author img

By

Published : Apr 29, 2021, 9:33 AM IST

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలకు అంత్యక్రియలు ప్రసహనంగా మారింది. కొవిడ్ బారినపడి హైదరాబాద్‌లో ప్రాణాలు కోల్పోయినవారి బంధువులు.. శ్మశాన వాటికల్లో దోపిడీతో అల్లాడుతున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారనే కనికరం చూపకుండా జలగళ్లా పీల్చి పిప్పి చేస్తున్నారు.

corona patients Funerals
శ్మశాన వాటికల్లో దోపిడీ

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్‌ ఉద్ధృతికి మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా అంత్యక్రియలకు అడిగినంత ఇవ్వకపోతే శ్మశానవాటికల్లోనూ చోటుదక్కడం లేదు. ఇప్పటికే కరోనా ఔషధాల దగ్గరి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిలువు దోపిడీ జరుగుతుండగా.. శవాల మీదా పేలాలు ఏరుకుంటున్న ఘటనలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఉంటూ కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినా.. బాధితులను అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి తీసుకువస్తే ఊపిరి వదిలినా.. అంత్యక్రియలు భారంగా మారుతున్నాయి. బతికించుకోవాలనే తపనతో అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ఆసుపత్రుల్లో చేరుస్తున్న బంధువులు.. ప్రాణాలు దక్కక అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు.

కరోనా మృతదేహాలను తరలించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అంగీకరించని ఫలితంగా సమీపంలోని శ్మశాన వాటికల్లోనే చివరి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. శ్మశాన వాటికల్లో రద్దీ పెరగ్గా.. అంత్యక్రియలు జరిపించేందుకు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా చేసుకుంటున్న మానవత్వం లేని మనుషులు.. ఆ కార్యక్రమం జరిపించేందుకు రూ.25 నుంచి 35 వేలు వసూలు చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

శవం కాలాలంటే కనీసం రూ.50 వేలు..

మృతుల కుటుంబాల ఆర్తనాదాలు ఆలకించకుండా.. శ్మశానవాటికల్లోని పురపాలక సిబ్బంది, గుత్తేదారులు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఎస్​.ఆర్.నగర్‌, ఈఎస్​ఐ శ్మశాన వాటికల్లో అనారోగ్యంతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేవారు. కరోనా విలయ తాండవంతో ఎర్రగడ్డ, ఎస్​.ఆర్​.నగర్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, వెంగళరావ్‌ నగర్, బోరబండ, భరత్‌ నగర్, అమీర్‌పేట, మూసాపేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి మృతదేహాలను తీసుకొచ్చి హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. మృతదేహాన్ని తరలించేందుకూ అంబులెన్స్‌లలోనూ దోపిడీ చేస్తున్నారు. రూ.15 నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. శవం కాలాలంటే కనీసం రూ.50 వేలు గుంజుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.

గతం కంటే నాలుగు రెట్లు అధికంగా వసూలు..

గాంధీ సహా నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందిన వారి అంతిమ సంస్కరాలను విద్యుత్ దహన వాటికల్లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను జీహెచ్​ఎంసీ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయిన వారికి కట్టెలపై దహనం చేస్తున్నారు. ఫిలింనగర్, ఈఎస్​ఐ, బన్సీలాల్‌పేట శ్మశాన వాటికల ఎదుట అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి. బుధవారం బన్సీలాల్‌పేటలో 25, ఈఎస్​ఐ శ్మశాన వాటికలో 35కు పైగా.. మల్కాజిగిరి శ్మశాన వాటికలో ఐదారు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేశారు. సాధారణ పరిస్థితుల్లో శ్మశాన వాటికల్లో మృతదేహం దహనానికి రూ.7 నుంచి రూ.8 వేలు తీసుకునే నిర్వాహకులు ప్రస్తుతం నాలుగు రెట్లు వసూలు చేస్తున్నారు.

అంబర్‌పేట శ్మశాన వాటికలో విద్యుత్ దహన వాటికకు మరమ్మత్తు వల్ల కట్టెలపైనే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో 10 ఫ్లాట్‌ఫారాలు ఉండగా.. కట్టెలపైనే వేగంగా దహనం చేస్తున్నారు. అంత్యక్రియల నిర్వహణకు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని అంతా గుత్తేదారులే మాట్లాడుకుంటారని కాటికాపరులు చెబుతున్నారు.

ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి..

జంట నగరాల్లో కరోనా బారినపడి మరణించిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న శ్మశాన వాటికల్లో మౌలిక సౌకర్యాల లేమి వేధిస్తోంది. ఈఎస్​ఐ సహా పలు శ్మశాన వాటికల్లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టకపోవడంతో బాధిత బంధువులు భయాందోళన చెందుతున్నారు. కనీసం ప్రాణాలు కాపాడుకోలేకపోయినా.. కష్టాల్లో డబ్బుల కోసం వేధించకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని పేద, మధ్య తరగతి ప్రజలు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

కరోనా చికిత్స మాటున అడ్డగోలు దోపిడీ.. పలువురిపై కేసు నమోదు

సైకిల్‌పై భార్య శవం.. దిక్కుతోచని స్థితిలో భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.