ETV Bharat / city

'బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనేది..?'

author img

By

Published : Feb 1, 2021, 7:23 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధికార పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ చాలా నిరాశాజనకంగా ఉందని... ఏపీకి శరాఘాతంగా మారిందని.. వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనే లేదని... బడ్జెట్‌ చాలా నిరుత్సాహ పరిచే విధంగా ఉందన్నారు వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి. నరేగా నిధులు, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులు సరిగా లేకున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొస్తామన్నారు.

Funds Allocation for AP In Union Budget
Funds Allocation for AP In Union Budget

ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదు. త్వరలో ఎన్నికలున్న రాష్ట్రాల్లో ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించిన కేంద్రం.. అందులో భాగంగానే ఏపీలోనూ సరకు కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విజయవాడ - ఖరగ్‌పూర్‌ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు చేస్తామని.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌లో భాగంగా ఖరగ్‌పుర్‌ - విజయవాడ, తూర్పు - పశ్చిమ కారిడార్‌ కింద భూసవల్ ‌- ఖరగ్‌పుర్‌, ధంకుని, ఉత్తర, దక్షిణ కారిడార్‌లో భాగంగా ఈటార్సి నుంచి విజయవాడ వరకు రోడ్డు పనులు చేపట్టనున్నారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు... లక్షా 18 వేల 101 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అందులో లక్షా 8వేల 230 కోట్లు తొలిసారి పెట్టుబడిగా కేటాయించినట్లు వివరించారు.

దేశంలోని పలు ప్రధాన మార్గాల్లో ఎక్స్‌ప్రెస్​వేల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో విశాఖపట్నం - రాయచూర్‌ మధ్య 464 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వేను.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తామని చెప్పారు. నాలుగు, ఆరు వరుసల జాతీయ రహదారులపై... అత్యాధునిక ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోని ఐదు ప్రధాన ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తామన్న కేంద్రమంత్రి.. అందులో విశాఖ రేవు కూడా ఉందని వెల్లడించారు. కొచ్చి, చెన్నై, పారాదీప్, పెటువా ఘాట్‌ సహా.. విశాఖ హార్బర్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు వీలుగా సదుపాయాలు పెంచుతామని వివరించారు.

ఇదీ చదవండీ... నిర్మలమ్మ '2021 బడ్జెట్'​ హైలైట్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.