ETV Bharat / city

contract professors: కొలువులేమో ఒప్పందం.. సమస్యలే శాశ్వతం.. అమలు కాని కనీస టైంస్కేలు

author img

By

Published : Oct 23, 2021, 4:32 AM IST

విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద ఆచార్యుల(contract professors of universities) పరిస్థితి దయనీయంగా మారింది. ఒకే తరహా పనిచేస్తున్నా.. కనీస వేతనం లభించడం లేదు. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధంగా ఒప్పంద ఆచార్యులకు వేతనాలు ఇస్తున్నారు. ఎయిడెడ్‌ కళాశాలలు రద్దు కావడంతో ఆ సిబ్బందికి వర్సిటీల్లో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

contract professors working in universities
విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద ఆచార్యుల పరిస్థితి దయనీయం

బాబు వస్తే జాబు రావడం కాదు.. ఉన్నవి ఊడుతున్నాయి. ఈ రోజు నన్ను విక్రమ సింహపురి ఆచార్యులు కలిశారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచీ వారు పని చేస్తున్నారు. 28 మందిని తొలగిస్తే కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అధికారులు కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నారని వారు వాపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కోర్టు ధిక్కార కేసులు నమోదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. మన ప్రభుత్వం వస్తే పర్మినెంట్‌ చేస్తాం.

- సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఒప్పంద ఆచార్యులకు ఇచ్చిన హామీ ఇది. వారికి శాశ్వత ఉద్యోగాలు రాకపోగా గత ప్రభుత్వం కనీస టైంస్కేల్‌ అమలు చేయాలని ఇచ్చిన జీవో 24నూ అమలు చేయడం లేదు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద ఆచార్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకే తరహా పనిచేస్తున్నా.. కనీస వేతనం లభించడం లేదు. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధంగా ఒప్పంద ఆచార్యుల(contract professors of universities)కు వేతనాలు ఇస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో జీవో 24 ప్రకారం కనీస టైంస్కేల్‌ అమలు చేస్తున్నా విశ్వవిద్యాలయాలు అందుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒప్పంద ఆచార్యులకు నెలకు రూ.57 వేలు వేతనం రావాల్సి ఉంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కూడా ఇస్తే.. రూ.80 వేల దాకా వేతనం వస్తుంది. కానీ డీఏ వర్సిటీ ఐచ్ఛికం. రాష్ట్రంలోని 17 వర్సిటీల్లో 1,848 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులే ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఒప్పంద ఆచార్యులకు నోటిఫికేషన్‌ ఇస్తారు. తిరిగి వారినే నియమిస్తుంటారు. కొన్ని వర్సిటీలు రూ.40 వేలు ఇస్తే.. కొన్ని రూ.22 వేలే చెల్లిస్తున్నాయి.

శాశ్వత ఆచార్యుల మాదిరిగా యూజీసీ నెట్‌, ఏపీసెట్‌, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ వంటి అర్హతలు ఉంటేనే తీసుకుంటున్నారు. వీరు వర్సిటీల్లో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ హోదాలో ఆచార్యులుగా పని చేయాల్సి ఉంది. ఒప్పంద ఆచార్యులను టీచింగ్‌ అసిస్టెంట్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాల్లో తీసుకుంటున్నారు. వీరు మరణిస్తే పరిహారం ఇస్తామని జీవో 25ను జారీ చేశారు. జీవో 17 ప్రకారం ప్రసూతి సెలవులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ రెండూ అమలు కావడం లేదు. డిగ్రీ కళాశాలల్లో పనిచేసే వారికి 12 నెలలు వేతనాలు లభిస్తుండగా, విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద ఆచార్యులకు 10 నెలలకే ఇస్తారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలూ కల్పించడం లేదు. ఎయిడెడ్‌ కళాశాలలు రద్దు కావడంతో ఆ సిబ్బందికి వర్సిటీల్లో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రమబద్ధీకరించాలి

విశ్వవిద్యాలయా(contract professors of universities)ల్లో గత 15 ఏళ్లుగా చేస్తున్నాం. గత ప్రభుత్వం మినిమం టైంస్కేల్‌ ఇచ్చేందుకు జీవో జారీ చేసింది. దాన్ని అమలు చేయాలి. మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించి... ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎయిడెడ్‌ సంస్థల అధ్యాపకులను వర్సిటీల్లో సర్దుబాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని ఆపేయాలి. - మల్లి భాస్కర్‌, రాష్ట్ర అధ్యక్షుడు, కాంట్రాక్టు ఆచార్యుల సంఘం

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.