ETV Bharat / city

Amaravathi Registrations: స్థలం తెలియకుండా రిజిస్ట్రేషన్‌ ఎలా?

author img

By

Published : Mar 28, 2022, 10:12 AM IST

Amaravathi Registrations: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు 3నెలల్లోగా అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగించాలని హైకోర్టు ఆదేశిస్తే, అభివృద్ధి చేయకుండా స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఒత్తిడి తేవడంపై నిరసన వ్యక్తమవుతోంది. స్థలం ఎక్కడుందో తెలియకుండా రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్‌ సరఫరా వంటి కనీస వసతులు కల్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకోమంటే అర్థముందని చెబుతున్నారు. అదేమీ లేకుండా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ గడువు పెట్టడమేంటని ధ్వజమెత్తుతున్నారు.

Amaravathi Registrations
స్థలం తెలియకుండా రిజిస్ట్రేషన్‌ ఎలా

Amaravathi Registrations: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు 3నెలల్లోగా అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగించాలని హైకోర్టు ఆదేశిస్తే... అభివృద్ధి చేయకుండా స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఒత్తిడి తేవడంపై నిరసన వ్యక్తమవుతోంది. తమ కోసం వేసిన లేఅవుట్లలో పొదలు, పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయని రైతులు వివరిస్తున్నారు. స్థలం ఎక్కడుందో తెలియకుండా రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్‌ సరఫరా వంటి కనీస వసతులు కల్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకోమంటే అర్థముందని చెబుతున్నారు. అదేమీ లేకుండా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ గడువు పెట్టడమేంటని ధ్వజమెత్తుతున్నారు. కొందరు రైతులకు భూసమీకరణలో ఇవ్వని భూముల్లో, వాగులు, వంకల్లో, రోడ్లపైనా స్థలాలు కేటాయించారని వివరిస్తున్నారు. స్థలాలు అభివృద్ధి చేసి ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని భూసమీకరణ అధికారులుగా ఉన్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నారు.

అభివృద్ధి చేసి చెప్పండి: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సుమారు 65 వేల స్థలాలను (వివిధ పరిమాణాల్లోనివి) సీఆర్‌డీఏ లాటరీ పద్ధతిలో కేటాయించింది. రాళ్లు పాతి స్థలాల హద్దులు నిర్ణయించింది. ఆ లేఅవుట్లను వివిధ ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి మౌలిక వసతుల పనులను గుత్తేదారులకు అప్పగించింది. విద్యుత్‌, గ్యాస్‌, టెలికమ్యూనికేషన్‌ కేబుళ్లు వంటివి, మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలు వంటివి భూగర్భంలోనే వెళ్లేలా అత్యాధునిక మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సంకల్పించింది. పనులు మొదలుపెట్టే దశలో ప్రభుత్వం మారడంతో రాజధాని నిర్మాణం నిలిచింది. ఖాళీగా ఉన్న ఈ స్థలాలన్నీ అడవుల్లా మారాయి.

* రైతులకు స్థలాలిచ్చిన ఎల్‌పీఎస్‌ లేఅవుట్లను రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం సీఆర్‌డీఏ రూపొందించింది. కొన్నిచోట్ల ఆ లేఅవుట్లలోకి చెరువులు, వాగులు, వంకలు, రోడ్లు కూడా వచ్చాయి. కొందరు రైతులకు వాగులు, చెరువు ప్రాంతం, రోడ్లపైనా స్థలాలిచ్చారు. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేసే క్రమంలో వాటన్నింటినీ చదును చేసి రైతులకు ప్లాట్లు అప్పగిస్తామని అప్పట్లో సీఆర్‌డీఏ చెప్పింది. అలా వీలుకాని చోట ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని హామీనిచ్చింది.

* తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో కొంత భూమిని రైతులు భూసమీకరణలో ఇవ్వలేదు. ఆ భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవకముందే భూసమీకరణలో భూములిచ్చిన కొందరు రైతులకు అక్కడా సీఆర్‌డీఏ స్థలాలిచ్చింది. కొందరు సీఆర్‌డీఏ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా ప్రత్యామ్నాయ స్థలం చూపించారు. కొందరికి వేరే స్థలం చూపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందడం గ్రామానికి చెందిన ఆలూరి యుగంధర్‌, ఆయన కుమారుడికి భూసేకరణలో తీసుకోవాలనుకుంటున్న భూమిలో స్థలాలిచ్చారు. ఆ స్థలాల్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోమని సీఆర్‌డీఏ అధికారులు లేఖలు పంపించడంపై వారు అభ్యంతరం తెలిపారు. అదెలా సాధ్యమంటూ యుగంధర్‌ సీఆర్‌డీఏ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు మంగళవారం లేఖ అందజేశారు. ఆయనలాంటి రైతులు మరి కొందరున్నారు.

స్థలాల రిజిస్ట్రేషన్‌పై రైతుల్లో అనాసక్తి: సీఆర్‌డీఏ రైతులకు కేటాయించిన స్థలాల్లో సుమారు 42వేల స్థలాల రిజిస్ట్రేషన్‌ లోగడే జరిగింది. మిగిలిన 23వేల స్థలాల రిజిస్ట్రేషన్‌కు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సీఆర్‌డీఏ తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. మూడేళ్లలోగా స్థలాలు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పిందే తప్ప ఇన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్న నిబంధనేదీ లేదని రైతులు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయింపు.. స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పటినుంచి రెండేళ్ల వరకే వర్తిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆ వెసులుబాటును ఎందుకు కోల్పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. మొదట తమ లేఅవుట్లలో పెరిగిన పిచ్చిమొక్కలన్నీ తొలగించి సరిహద్దు రాళ్లు సరిగా ఉన్నాయో లేదో సరిచూసి కనీస వసతులను అభివృద్ధి చేస్తేనే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని పలువురు రైతులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: SP alligations on MP: నా స్థలాన్నీ కాజేయాలని చూస్తున్నారు... ఎంపీపై ఇంటెలిజెన్స్‌ ఎస్పీ ఆరోపణలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.