ETV Bharat / city

FAKE CHALLANS: నకలీ చలానాల వ్యవహారం..మిగతా శాఖల్లో అధికారుల తనిఖీలు

author img

By

Published : Sep 3, 2021, 1:35 PM IST

Updated : Sep 3, 2021, 10:07 PM IST

FAKE CHALLANS
FAKE CHALLANS

13:29 September 03

నకిలీ చలానాల వ్యవహారం

   స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం మిగతా శాఖల్లోనూ తనిఖీలు మొదలు పెట్టింది. ఈ మేరకు ఆదాయార్జనతో సంబంధం ఉన్న ప్రతీ విభాగంలోనూ అంతర్గతంగా తనిఖీలు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఎక్సైజు, మైనింగ్, దేవాదాయ, రవాణా, కార్మిక శాఖలతో పాటు ఇతర శాఖల్లో అంతర్గత విచారణను చేపట్టారు. చలానాల ద్వారా చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్​కు జమ అవుతోందా లేదా అన్న అంశంపై విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సేవలు.. అందుకోసం నిర్దేశించిన ఫీజుల మొత్తం జమ అయిన మొత్తాలపై ఆరా తీస్తున్నారు. వాస్తవానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇప్పటికే అంతర్గతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  

 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 8.13 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం రూ.4.62 కోట్ల మేర అధికారులు రికవరీ చేశారు. 14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చెల్లించిన చలానాలకు సంబంధించిన పూర్తి వివరాలు సబ్ రిజిస్ట్రార్​లు చూడకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వినియోగదారులు సీఎఫ్ఎంఎస్​కు చెల్లించిన మొత్తంతో చలానా సరిపోయిందా లేదా అన్నది తనిఖీకి ఆస్కారం లేకపోవటంతో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. దీంతో ఇతర శాఖల్లోనూ ఈ తరహా మోసాలు జరిగి ఉండొచ్చన్న అంచనాల మేరకు ఆయా విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు.

  భూమి శిస్తు, నాలా పన్ను, ఎక్సైజు, రవాణా, వాణిజ్య పన్నులకు సంబంధించిన వివిధ లావాదేవీల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసే చెల్లింపులు ఏ మేరకు ఉంటున్నాయన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. లావాదేవీల్లో నమోదు అవుతున్న చలానాల సంఖ్య అందుకు అనుగుణంగా పౌరసేవలు, సీఎఫ్ఎంఎస్ ద్వారా ఖజానాకు జమ అవుతున్న మొత్తాల వివరాలను రికన్సిలియేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఈ అవకతవకలకు తావులేకుండా చేయాలని నిర్ణయించారు. ప్రజలు చెల్లించే చలానాల నగదు సీఎఫ్ఎంఎస్​కు జమ కావటంలో జాప్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఖజానాకు గండి..

 నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్​లైన్ ద్వారా అప్​లోడ్ చేసిన చలాన్లపై అధికారులు పరిశీలించి.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. 2021 జనవరి నుంచి నకిలీ చలానాలతో మోసం జరిగినట్లు గుర్తించారు.  

కోట్లాది రూపాయలకు పైగా గండి...

 కడప జిల్లాలో మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రైటర్స్‌గా పనిచేసిన వ్యక్తులే ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని తేల్చిన పోలీసులు.. కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించారు.  

వెసులుబాటును అవకాశంగా మలుచుకుని...

 ప్రజల వెసులుబాటు కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన సీఎంఎఫ్ఎస్ విధానం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ విధానంలో కంప్యూటర్‌ ద్వారా వచ్చే చలానాలపై అధికారుల ధ్రువీకరణ సంతకాలు, సీళ్లు ఉండవు. నకిలీ చలానాలు సృష్టించడానికి ఇది మొదటి లోపంగా మారింది. చలానా కట్టిన అనంతరం రిజిస్ట్రేషన్‌ చెల్లింపు మొత్తాన్ని ఎడిట్‌ చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమార్కులు వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: 

FAKE CHALLAN : నకిలీ చలానాల కుంభకోణం... విస్తుపోయే నిజాలు

Last Updated : Sep 3, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.