ETV Bharat / city

దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు 'ఈటీవీ బాలభారత్'​ అంకితం: రామోజీరావు

author img

By

Published : Apr 27, 2021, 8:27 PM IST

etv bal bharat channel
etv bal bharat channel in 12 languages

ఉరుము ఉరిమినా.. మెరుపు మెరిసినా అన్ని వింతలూ తమ కోసమే అనుకునే బాలలు.. ఎంతటి పెద్ద విషయమైనా అమ్మ చెబితే శ్రద్ధగా వింటారు. చిన్నపిల్లల ఊహలకు రెక్కలు తొడిగే శక్తి మాతృభాషకు మాత్రమే ఉంది. అందుకే.. ఆటల, పాటల హరివిల్లును.. ఈటీవీ నెట్‌వర్క్‌ మరింత సందడిగా మార్చింది. 11 ప్రాంతీయ భాషలతో పాటు.. ఆంగ్లంలోనూ పిల్లలకు వినోదం పంచేందుకు బాలభారత్‌ ఛానెళ్లు వచ్చేశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈ 12 ఛానెళ్లను రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలభారత్‌ను దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు అంకితమిస్తున్నామన్నారు.

ఈటీవీ బాలభారత్ - అంతులేని వినోదం, అందమైన ప్రపంచం

వినోదంతోపాటు విజ్ఞానం, విలువలు నేర్పేందుకు బాలల కోసమే ప్రత్యేకంగా బాలభారత్‌ ఛానెల్‌ను తీసుకొచ్చింది ఈటీవీ నెట్‌వర్క్‌. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తెలుగు, తమిళంతోపాటు.. ఇంగ్లిష్‌లోనూ ఈ ఛానెల్‌ ప్రసారమవుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ ఛానెళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సరిగ్గా 10 గంటల 35 నిమిషాలకు.. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు.. 12 బాలభారత్‌ ఛానెళ్లను ప్రారంభించారు. చిన్నారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ ఛానెళ్ల ప్రసారాలు ఉంటాయని ఆయన అన్నారు.

'ప్రియమైన పిల్లల్లారా.. అందరి అభిమానం పొందడానికి మీరంతా అర్హులు. హద్దుల్లేని మీ ఉత్సాహం, మీలోని ఉత్సుకత, అద్భుతమైన మీ ఆలోచన శైలి, కొంటెతనం, సృజనాత్మకత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. 'ఈటీవీ బాలభారత్‌' అనే అద్భుతమైన బహుమతిని మీకు అందిస్తున్నాను. మీ మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌లో మీకోసమే తీసుకొచ్చిన టీవీ ఛానల్‌ను.. మీరు ఇష్టంగా చూసే అనేక కార్యక్రమాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. మీలోని సూపర్‌హీరోలు కోరుకునే సాహసం, స్ఫూర్తితో పాటు.. మ్యాజిక్, మిస్టరీ, మీకు సరైన మార్గం చూపే నీతికథలు ఇందులో ఉంటాయి. 'బాలభారత్‌' ద్వారా అంతులేని వినోదం, అందమైన ప్రపంచం, కార్టూన్లు, అద్భుత చిత్రాలు మీకు అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఈటీవీ బాలభారత్‌ను దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు అంకితమిస్తున్నాం.' - రామోజీ రావు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్

అద్భుత కథలను వాస్తవికతకు దగ్గరగా అనిపించే దృశ్యాలతో, మాతృభాషలోని తియ్యదనాన్ని కలగలిపి.. బుల్లితెరలకు బుజ్జిపాపాయిలను కట్టిపడేసే కార్యక్రమాలు ఈటీవీ బాలభారత్‌ సొంతం. భారతీయ సంప్రదాయాలు, విలువలను కథలో సమ్మిళితం చేసి.. చిన్నారి ప్రేక్షకుల హృదయాలను బాలభారత్ చానెళ్లు.. వినోదంలో ముంచెత్తుతున్నాయి. ఆటల్లోని ఆనందాన్ని, అన్వేషణలో కుతూహలాన్ని రెట్టింపుచేసే.. ఉత్సాహపూరితమైన కార్యక్రమాలు బాలల కోసం బాలభారత్‌ రూపొందించింది. బాలల వినోద ప్రపంచానికి సరికొత్త సొబగులు అద్దే యానిమేషన్‌, లైవ్‌ యాక్షన్‌తో రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలు.. ఈటీవీ బాలభారత్‌కే ప్రత్యేకం. మనసులను కట్టిపడేసేలా.. ఆకర్షణీయమైన పాత్రలతో.. సాహస, హాస్య, పోరాట గాథలను పిల్లలకు బహుమతులుగా బాలభారత్‌ ఇస్తోంది. ఇంతేకాదు.. మిస్టరీ, ఫాంటసీ ప్రపంచాన్నీ మీ ముందుకు తీసుకొస్తోంది. బుజ్జాయిలను కితకితలు పెట్టే, ఆశ్చర్యానికిలోనుచేసే సినిమాలనూ అందిస్తోంది.

ఇదీ చదవండి: 'ఈటీవీ బాలభారత్'​ ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.