ETV Bharat / city

రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన విద్యుత్తు డిమాండు... వాయుదేవుడే దిక్కు!

author img

By

Published : May 2, 2022, 5:10 AM IST

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో.. విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. నివారం ఒక్క రోజే 218.924 మిలియన్‌ యూనిట్లుగా డిమాండు నమోదైంది. దీంతో విద్యుత్తు పంపిణీ మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని డిస్కంలు భావిస్తున్నాయి. పరిశ్రమలకు విద్యుత్తు విరామం ప్రకటించడంతో 20 ఎంయూల వినియోగం తగ్గినా .. అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరిట ప్రజలకు రోజూ విద్యుత్తు కోతల బాధలు తప్పటం లేదు.

power
power

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో గృహ విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే 218.924 మిలియన్‌ యూనిట్లుగా (ఎంయూలు) డిమాండు నమోదైంది. దీంతో విద్యుత్తు పంపిణీ మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని డిస్కంలు భావిస్తున్నాయి. ఏపీ థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి 75.55 ఎంయూలు, జెన్‌కో జలవిద్యుత్తు నుంచి 5.56, కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థల నుంచి 35.58, ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఐపీపీ) నుంచి 16.50, పవన విద్యుత్తు 26.52, సౌర విద్యుత్తు 23.32 ఎంయూల ఉత్పత్తి వస్తోంది. సర్దుబాటుకు 34.86 ఎంయూల విద్యుత్తును ఎక్స్ఛేంజీల నుంచి డిస్కంలు కొన్నాయి. శుక్రవారం పవన విద్యుత్తు 7.27 ఎంయూలే వచ్చింది. శనివారం గాలుల తీవ్రత బాగుండటంతో ఇది 19.25 ఎంయూలు పెరిగి.. 26.52 ఎంయూలు వచ్చింది.

రాబోయే రోజుల్లో గాలులు మరింత ఎక్కువవుతాయని, అందువల్ల పవన విద్యుత్తు ఉత్పత్తి బాగుంటుందని భావిస్తున్నారు. పరిశ్రమలకు విద్యుత్తు విరామం ప్రకటించడంతో 20 ఎంయూల వినియోగం తగ్గినా అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరిట ప్రజలకు రోజూ విద్యుత్తు కోతల బాధలు తప్పటం లేదు. గ్రామాల్లో గంట, కొన్ని మున్సిపాలిటీల్లో కనీసం అరగంట అనధికారిక కోతలు అమలవుతున్నాయి. శుక్రవారం డిమాండు 215.23 ఎంయూలుగా ఉంటే.. లోడ్‌ రిలీఫ్‌ పేరిట 4.3 ఎంయూలను డిస్కంలు సర్దుబాటు చేశాయి. దీంతో విద్యుత్తు ఎక్స్ఛేంజీల నుంచి రోజుకు రూ.37-40 కోట్లు వెచ్చించి విద్యుత్తు కొంటున్నాయి. యూనిట్‌కు సగటున రూ.11.098 నుంచి రూ.12.024 వంతున వెచ్చిస్తున్నాయి.

ఇప్పటివరకూ ఎలాగోలా సర్దుబాటు చేస్తున్న థర్మల్‌ విద్యుత్తుకూ గండం పొంచి ఉంది. ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు పూర్తిగా తరిగిపోయి ఒక రోజుకు సరిపడా నిల్వలే ఉన్నాయి. విజయవాడ వీటీపీఎస్‌లో 32,494 టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇక్కడ ఉన్న ప్లాంట్లకు రోజుకు 28,500 టన్నుల బొగ్గు అవసరం. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న నిల్వలు 1.14 రోజులకే సరిపోతాయి. ఆర్‌టీపీపీలో 25,778 టన్నుల నిల్వలు 1.23 రోజులకే సరిపోతాయి. కృష్ణపట్నంలో 1.31 లక్షల టన్నుల నిల్వలున్నాయి. అవి 6.93 రోజులకు సరిపోతాయని జెన్‌కో అంచనా. రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లకు రోజుకు సుమారు 68,500 టన్నుల బొగ్గు అవసరం ఉంటే.. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి శనివారం 42,769 టన్నులే వచ్చింది.

పవన విద్యుత్తు కోసం ఎదురుచూపు
పవన విద్యుత్తు కోసం డిస్కంలు ఎదురుచూస్తున్నాయి. ఈ నెల రెండో వారం నుంచి గాలులు మొదలవుతాయని.. దీంతో పవన విద్యుత్తు సుమారు 1,500 మెగావాట్ల వరకు అందుబాటులోకి వస్తుందని డిస్కంల అంచనా. దీనికి తోడు అప్పటికి క్రమేణా వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తున్నాయి. దీంతో రెండో వారం నుంచి సరఫరా కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అనధికారిక కోతలతో వెతలు
గృహ, వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నట్లు డిస్కంలు చెబుతున్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ కోతలు అమలవుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో రోజులో కనీసం అరగంట పాటు అనధికారిక విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోజూ కనీసం అరగంట, పుత్తూరులో 2 గంటలు అనధికార కోతలు విధిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రోజుకు 2-3 గంటలు, పాలకొండ మున్సిపాలిటీలో రోజుకు గంటసేపు అనధికారిక కోతలు అమలవుతున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పలుచోట్ల వడగళ్ల వాన.. నేలరాలిన పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.