చినుకొస్తే వణుకే.. అసంపూర్తి డ్రైనేజీ పనులతో ప్రజలకు అవస్థలు..

author img

By

Published : Jun 21, 2022, 3:58 AM IST

draibage problems in ap districts due to rains
draibage problems in ap districts due to rains ()

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వరదనీటి కాలువలు, భూగర్భ మురుగునీటి పనులు... నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నిరుటి వర్షాకాలంలో రోడ్లపైకి మురుగు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారికి ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు.

విశాఖలోని పెందుర్తిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనుల కోసం రోడ్లను తవ్వేసి, వదిలేస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుజాతనగర్‌, చినముషిడివాడ, పాపయ్యరాజుపాలెం చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో వర్షం కురిస్తే స్థానికులకు నరకమే. మూడేళ్ల క్రితం మొదలైన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

విజయవాడలో గత ఏడాది చాలాప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాలువల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపంతో పక్కకు జరపలేదు. ఆక్రమణల తొలగింపులోనూ రాజకీయ జోక్యంతో ముందడుగు పడలేదు. వరద నీటి కాలువల నిర్మాణానికి రూ.461.04 కోట్ల అంచనాతో 2016లో పనులు మొదలవగా ఇప్పటి వరకు రూ.172 కోట్లు ఖర్చయ్యాయి. 35 శాతానికిపైగా పనులు మిగిలే ఉన్నాయి. ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత లేదు.

.

గుంటూరు, నెల్లూరులో పెండింగ్‌

గుంటూరు, నెల్లూరులలో రెండుచోట్లా కలిపి దాదాపు రూ.141 కోట్ల యూజీడీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో గుత్తేదారులు పనులను నిలిపివేశారు. భూగర్భ పైపులైన్లు, మ్యాన్‌హోళ్ల ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ)ను సిద్ధం చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేస్తేనే ఇళ్లకు యూజీడీ కనెక్షన్లు ఇవ్వొచ్చు. మ్యాన్‌హోళ్లు ఏర్పాటు చేశాక... రోడ్లను తిరిగి పునరుద్ధరించలేదు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో 2005లో విలీనమైన గాజువాక, పెందుర్తి, మల్కాపురంలలో యూజీడీ పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. పెందుర్తిలో రూ.360 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పనుల్లో ఇప్పటివరకు 70% పూర్తయ్యాయి. గాజువాక, మల్కాపురంలో రూ.430 కోట్లతో ప్రారంభించిన పనుల్లో 40% పూర్తయ్యాయి. గాజువాక, పెందుర్తిలో చాలాచోట్ల రోడ్లను మధ్యలో తవ్వేసి విడిచిపెట్టారు. కొద్దిపాటి వానలు కురిసినా రోడ్లన్నీ బురదమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

కడపలో దశాదిశ లేని పనులు

కడప నగరంలో 351 కి.మీ. పొడవున యూజీడీ నిర్మాణానికి 2008లో పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 285 కి.మీ. వరకు పూర్తయ్యాయి. కేటాయించిన రూ.72 కోట్లు వీటికే ఖర్చయ్యాయి. మిగిలిన పనుల పూర్తికి 2017లో అమృత్‌ పథకం కింద రూ.94 కోట్లను కేటాయించారు. వీటిలో రూ.36 కోట్లతో రెండు ఎస్టీపీల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులను ప్రారంభించలేదు. మరో రూ.54 కోట్లతో ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్ల నిర్మాణం, ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు ఇప్పటికి పదిసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. దీంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అధికారులే కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

14 చోట్ల యూజీడీ ఉన్నా సగం ఇళ్లకూ ఇవ్వని కనెక్షన్లు

రాష్ట్రంలోని 14 పుర, నగరపాలక సంస్థల్లో యూజీడీ వ్యవస్థ ఉంది. వీటి పరిధిలోని 14,15,266 నివాసాలు, నివాసేతరాల్లో కేవలం 6,51,918 ఇళ్లకే కనెక్షన్లు ఇచ్చారు. చాలాచోట్ల తగిన సామర్థ్యమున్న ఎస్టీపీలు లేకపోవడం, కొన్నిచోట్ల పైపులైన్లు అసంపూర్తిగా ఉండటంతో కనెక్షన్లు ఇవ్వడంలేదు. కర్నూలు, ఒంగోలు, అనంతపురం, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నగరాలతోపాటు మరో 18 పట్టణాల్లో యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణుల బృందం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు కొన్నిచోట్ల ప్రతిపాదనలు సిద్ధమైనా నిధులు కేటాయించలేదు. కాలువల్లో నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు అమృత్‌ పథకంలో కొన్నిచోట్ల ప్రారంభించిన ఎస్టీపీల నిర్మాణాలూ పూర్తి కాలేదు.

.

విజయవాడ భవానీపురంలో రెండున్నర కిలోమీటర్ల పొడవైన రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన వరదనీటి కాలువ పనులను 15చోట్ల మధ్యలోనే వదిలేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు తొలగించకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఎక్కడికక్కడే మురుగు నీరు నిలిచిపోయింది. వర్షం కురిసినప్పుడల్లా కాలువ పొంగిపొర్లుతోంది.

.

కడపలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ(యూజీడీ) పనుల్లో భాగంగా నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో రూ.20 కోట్లతో ఎస్టీపీ నిర్మించారు. యూజీడీ పనులు పూర్తవని కారణంగా ఇళ్లకు ఇప్పటికీ కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో 20 మిలియన్‌ లీటర్ల సామర్థ్యమున్న ఎస్టీపీ వృథాగా మారింది.

.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.