ETV Bharat / city

POLICE RECRUITMENTS : వచ్చే జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ

author img

By

Published : Jul 6, 2021, 7:26 AM IST

పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువకులు అధైర్యపడవద్దని.. డీజీపీ గౌతంసవాంగ్‌ అన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 6వేల 5వందల మందికి మాత్రమే పోలీసు శిక్షణ ఇచ్చే పరిస్థితి ఉందన్న సవాంగ్‌.. మిగిలిన ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తామని చెప్పారు.

dgp
dgp

వచ్చే జాబ్‌ క్యాలెండర్‌ నుంచి సంవత్సరానికి 6,500 చొప్పున నాలుగేళ్ల పాటు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆశావహులు నిరుత్సాహం చెందకుండా ఓపికతో ఉండాలని సూచించారు. ప్రస్తుతమున్న, భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి అన్ని నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 15,000 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో విలీనం చేసుకున్నామని, వారికి అత్యవసరంగా శిక్షణ ఇవ్వటం తొలి ప్రాధాన్యం కావడం వల్ల తాజా జాబ్‌ క్యాలెండర్‌లో ఈ విడతకు సంబంధించిన 6,500 పోస్టులు భర్తీ తాత్కాలికంగా వాయిదా పడిందని పేర్కొన్నారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఒక విడతలో గరిష్ఠంగా 6,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం మాత్రమే రాష్ట్రంలో ఉందని.. మహిళా పోలీసులకు క్యాప్సుల్‌ శిక్షణ ఇవ్వటానికి కొన్ని నెలలు పడుతుందని అన్నారు. 2018 చివర్లో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి ఫలితాల విడుదల, శిక్షణ, నియామకాలు అన్నీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని 2019-20 మధ్య 3,057 మంది పోలీసులు కొత్తగా ఉద్యోగాల్లో చేరారని చెప్పారు. ఇంకా 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. డీజీపీ ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే!

* 15 వేల మంది గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను విలీనం చేసుకోవటంలో పోలీసు శాఖ సామర్థ్యం మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ ఓ పోలీసు ఉన్నట్టే. మహిళా భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం. పోలీసు శాఖలో ప్రస్తుతం 4.46 శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు అదనంగా వచ్చి చేరటం వల్ల ఇప్పుడు వారి సంఖ్య 33 శాతానికి పెరిగింది.

* ప్రస్తుతం పోలీసుశాఖలోని పోస్టులకు.. అదనంగా మహిళా పోలీసు వ్యవస్థ ఉంటుంది. వారి విధులు, బాధ్యతలు, సర్వీసు నియమావళి తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు చేస్తాం.

* దిశ యాప్‌ను ఇప్పటివరకూ 20 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అత్యధిక శాతం మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రభుత్వ యాప్‌ ఇదే.

* ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లలో 1,84,264 రెగ్యులర్‌ ఉద్యోగాలను భర్తీ చేసింది. గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో కేవలం 34,563 ఖాళీలే భర్తీ చేసింది.

రాష్ట్ర పోలీసుశాఖలో మెుత్తం 14 వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 450 పోస్టులే భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగులు తీవ్రనిరాశకు గురయ్యారు. జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం ప్రకటన చూసి ఔత్సాహిత యువత నిరుత్సాహానికి లోనయ్యారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.