ETV Bharat / city

Maoists Surrender: ఏవోబీలో 60 మందే మావోయిస్టులు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

author img

By

Published : Aug 13, 2021, 5:20 AM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెండేళ్లలో అక్కడ మావోల నియామకం జరగకపోగా.. వారి సంఖ్య 140 నుంచి 60కి పడిపోయిందన్నారు. ఏరియా కమిటీలు 8 నుంచి 4కి తగ్గాయన్నారు. ఏవోబీలో ఇన్నాళ్లూ మావోయిస్టులుగా ఉండి.. పోలీసులకు లొంగిపోయిన ఆరుగురిని మీడియా ఎదుట హాజరుపర్చారు.

Maoists Surrender
Maoists Surrender

ఏవోబీలో మావోయిస్టుల సంఖ్య రెండేళ్లలో 140 నుంచి 60కు తగ్గిపోయిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 8 ఏరియా కమిటీలుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకే పరిమితమైందన్నారు. ఏవోబీలో పనిచేస్తూ పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏవోబీలో 60 మందే మావోయిస్టులు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

‘గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ఆదివాసీల ఇంటి వద్దకే అందుతున్నాయి. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించటం, బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా జీవో ఇవ్వడంతో మావోయిస్టులు పోరాడేందుకు సమస్యలే కరవయ్యాయి. ఫలితంగా వారికి స్థానికుల నుంచి మద్దతు కొరవడింది. ఈ క్రమంలోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు వంటి ప్రకటనలు చేస్తున్నారు. ఏవోబీలో స్థానిక ఆదివాసీలు మావోయిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించట్లేదు. దాంతో ఛత్తీస్‌గఢ్‌ వారిని తీసుకొచ్చి ఇక్కడ పని చేయిస్తున్నారు. వారికి స్థానిక భాష రాదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదు. స్థానికుల నుంచి సహకారం అందట్లేదు. పార్టీలో కొనసాగలేక వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. గత రెండేళ్లలో 11 ఎదురుకాల్పుల ఘటనల్లో 14 మంది మావోయిస్టులు మరణించారు. ఆరుగురు అరెస్టయ్యారు. మరో 32 మంది లొంగిపోయారు. ఇవన్నీ ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి’ అని డీజీపీ వివరించారు.

సుదీర్ఘ అజ్ఞాతం తర్వాత లొంగుబాటు

ఇష్టం లేని పెళ్లిపై కోపంతో ఒకరు.. సల్వాజుడుం హింసను అడ్డుకోవాలనే లక్ష్యంతో తొమ్మిది, పదేళ్ల ప్రాయంలోనే మావోయిస్టుల్లో చేరిపోయారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో కీలకంగా పనిచేశారు. చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌, నలుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు. పోలీసులు, లొంగిపోయిన వారు వెల్లడించిన వివరాల ప్రకారం వారి నేపథ్యాలివి..

* చిక్కుడు చిన్నారావు అలియాస్‌ సుధీర్‌ (పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి, డివిజనల్‌ కమిటీ సభ్యుడు): విశాఖ జిల్లా పెదబయలు మండలం వాకపల్లికి చెందిన చిన్నారావు.. బాకూరి వెంకటరమణ అలియాస్‌ గణేశ్‌ ప్రభావంతో 2009లో జన మిలీషియాలో పనిచేశారు. 2016 నాటికి డివిజనల్‌ కమిటీ సభ్యుడి స్థాయికి చేరారు. 15 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగుతూ 93 నేర ఘటనల్లో పాల్గొన్నారు.

* వంతల వన్ను అలియాస్‌ మహిత అలియాస్‌ శైలు (పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ సభ్యురాలు): విశాఖ జిల్లా జీకేవీధి మండలం సంపంగిగొందికి చెందిన వంతల వన్ను.. తనకు చిన్న వయసులోనే బలవంతంగా పెళ్లి చేస్తున్నారన్న కోపంతో 2014లో జన మిలీషియా సభ్యురాలిగా చేరారు. 2015-17 వరకు కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్‌కే వ్యక్తిగత రక్షణ బృందంలో పనిచేశారు. 2017 నాటికి ఏరియా కమిటీ సభ్యురాలి స్థాయికి చేరుకున్నారు. వీరితోపాటు మడకం సోమిడి (పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ సభ్యురాలు), మడకం మంగ్లు అలియాస్‌ దీపక్‌ (ఉదయ్‌ రక్షణ బృందం సభ్యుడు), పోయం రుకిని అలియాస్‌ రింకీ, సోడి భీమే (కలిమెల ఏరియా కమిటీ సభ్యులు) లొంగిపోయారు.

‘మావోయిస్టులను హతమార్చే ప్రయత్నం’

బూటకపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను హతమార్చడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారని మల్కాన్‌గిరి, కొరాపుట్‌, విశాఖపట్నం బోర్డర్‌ మావోయిస్టు డివిజన్‌ కార్యదర్శి రాకేష్‌ మల్లి ఆరోపించారు. ఆయన పేరిట గురువారం ఓ ఆడియో టేప్‌ విడుదలైంది.

ఇదీ చదవండి:

ఏపీలో కృష్ణా బోర్డు పర్యటనపై.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

'టీకాతీసుకున్న వారిలో ఆ ముప్పు అరుదే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.