ETV Bharat / city

అధికారుల ఫొటోలు వాట్సాప్​ డీపీలు పెట్టి మరీ మోసాలు.. అదీ నైజీరియా నుంచి​..!

author img

By

Published : Jul 5, 2022, 7:38 PM IST

Cyber Crime Accused Arrested
సైబర్​ క్రైమ్​

Cyber Crime Accused Arrested: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. మోసాలు చేసేందుకు సైబర్​ నేరస్థులు ఎంతమాత్రం జంకటం లేదు. ఏకంగా ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల పేర్లు, ఫొటోలను వాడుకుంటూనే అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. అలాంటి ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Cyber Crime Accused Arrested: పలువురి ప్రభుత్వ అధికారుల ఫొటోలు వాట్సాప్ డీపీలుగా పెట్టి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజ్ ఫొటోలతో పలువురిని అమెజాన్ గిప్ట్​కార్డులు అడగటంతో.. అనుమానం వచ్చిన కొందరు బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ నేరాల వెనుక నైజీరియన్లు ఉన్నారని గుర్తించారు.

కర్ణాటకకు చెందిన రాఘవ్ అప్పు, హరియణాకు చెందిన ఆనంద్ కుమార్ ఈ నేరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారుల ఫొటోలను వాట్సాప్ డీపీ(ప్రొఫైల్ ఫోటో)గా పెట్టి పలువురికి అత్యవసరంగా డబ్బు కావాలని.. అది కూడా అమెజాన్ గిఫ్ట్​కార్డుల రూపంలో పంపాలని కోరుతున్నారు. వాట్సాప్ సందేశంలో గిప్ట్​కార్డ్ కొనుగోలు చేసేందుకు అమెజాన్​కు రీడైరెక్ట్ అయ్యేలా లింకులు పంపుతున్నారు. నిజంగానే అధికారులు పంపిస్తున్నారని నమ్మిన కొందరు.. 1.25లక్షల విలువ చేసే గిఫ్ట్ కార్డులు పంపించారు. గిఫ్ట్​ కార్డులు వచ్చిన తర్వాత నిందితులు.. వాటిని నైజీరియన్లకు పంపిస్తున్నారు. ఇలా పంపించినందుకు గానూ.. ఇద్దరు నిందితులకు నైజీరియన్లు కమిషన్ ఇస్తున్నారు.

గజారావ్ భూపాల్, సీసీఎస్ జాయింట్ సీపీ

"సీనియర్​ ఆఫీసర్స్​ ఫొటోలను డీపీలుగా పెట్టి.. అర్జెంటుగా డబ్బులు కావాలని మెస్సేజ్​ పెడతారు. డబ్బులు డైరెక్టుగా కాకుండా.. ఓ లింక్​ ఇచ్చి అందులో రిచార్జ్​ చేయమంటారు. ఆ లింక్​ అమెజాన్​ గిఫ్ట్​కార్డ్​ రిఛార్జ్​కు వెళ్లిపోతుంది. ఇదంతా వాళ్లు నైజీరియా నుంచి ఆపరేట్​ చేస్తున్నారు. ఈ మోసం తెలియని కొందరు అమాయకులు.. నిజంగానే అధికారులు మెస్సేజ్​ పంపారేమోనని మోసపోయారు." -గజారావ్ భూపాల్, సీసీఎస్ జాయింట్ సీపీ

ఆ పంపిన గిఫ్ట్​ కార్డులను నైజీరియన్లు.. తిరిగి పాక్స్‌ఫుల్ డాట్​ కామ్​లో పెట్టి డిస్కౌంట్​కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. ఇంకొందరు దుండగులు.. ఏకంగా డీజీపీ ఫొటోనే డీపీగా పెట్టి పలువురిని డబ్బులు డిమాండ్ చేశారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.