ETV Bharat / city

తెలంగాణలో 8 వారాల్లో 25 రెట్లు పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Apr 15, 2021, 8:50 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్న కేసులు... ఆందోళనకు గురిచేస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ఇక్కడా... మహారాష్ట్ర పరిస్థితే నెలకొంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ విజృంభణ దృష్ట్యా సర్కార్‌ అప్రమత్త చర్యలను మరింత వేగవంతం చేసింది. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగినా... అధిగమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

telangana news today
తెలంగాణలో కొవిడ్‌ కేసులు

కరోనా రెండో దశ వ్యాప్తి... తెలంగాణ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. మహమ్మారి విజృంభణతో రోజురోజుకీ పరిస్థితులు క్రమంగా చేయిదాటిపోతున్నాయి. 8 వారాల్లో 25 రెట్లు కేసులు పెరిగాయి. ప్రస్తుతం 25 వేలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉండగా...వారిలో మూడోవంతు రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6 వారాల కిందట ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారి సంఖ్య... వెయ్యి మాత్రమే ఉండగా... ఇప్పుడు ఏకంగా ఎనిమిదింతలు పెరగటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో కొవిడ్ బారిన పడిన వారిలో 2.4 శాతం మందికి ఆక్సిజన్ అవసరం పడగా... ఇప్పుడది 4.5 శాతానికి పెరిగింది. మరోవైపు వెంటిలేటర్ మీదకు వచ్చే వారి సంఖ్య సైతం 2.7 శాతానికి చేరింది. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ... కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంతోపాటు మరిన్ని కార్యాలయాల్లో ఉన్నతాధికారులు వైరస్‌ బారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఒక్క రోజే 728 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో మహారాష్ట్ర పరిస్థితి!

కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందనే బలమైన ఆధారాలున్నాయని.. అప్రమత్తంగా ఉండకపోతే మహారాష్ట్ర పరిస్థితే రాష్ట్రంలో నెలకొంటుందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయని... పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత నెలకొంటుందని చెప్పారు. గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని... ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్‌ ధరించాలని చెప్పామని.. ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని.. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టడం లేదన్నారు.

మెరుగైన సేవలందించాలి

కరోనాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 20 పడకలపైగా ఉన్న అన్ని ఆస్పత్రులకు కొవిడ్ చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వటంతోపాటు... కార్పొరేట్ ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం పడకలు కరోనా రోగులకు కేటాయించాలని ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పడకలను సైతం కొవిడ్ రోగులకు వినియోగించాలని నిర్ణయించింది. ఫలితంగా అదనంగా మరో 20 వేల పడకలు అందుబాటులో వచ్చే అవకాశం ఉండగా... ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారి కోసం 26 వేల 303 పడకలు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రితోపాటు గచ్చిబౌలి టిమ్స్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సందర్శించి... సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమై... బాధితులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ప్రైవేటు అసుపత్రిలో చికిత్సపొందుతున్న వారు సీరియస్‌గా ఉంటే... గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈటల వెల్లడించారు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా... ప్రజలు అప్రమత్తంగా లేకపోతే... వైరస్‌ను కట్టడి చేయటం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. మాస్కు, భౌతిక దూరంతోపాటు మిగతా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వ సూచన మేరకు అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : 'కరోనా​ లక్షణాలు కనిపిస్తే కోర్టుకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.