ETV Bharat / city

తహసీల్దార్ల సంతకాలను కలెక్టర్లు పెట్టేస్తున్నారు.. ఇదేంటి అనుకుంటున్నారా?

author img

By

Published : Sep 18, 2022, 7:43 PM IST

Collectors copied MROS
ధరణి చట్టాలు

Collectors copied MROS digital signatures: తెలంగాణ రాష్ట్రంలో భూదస్త్రాలపై డిజిటల్‌ సంతకాల అధికారం కలెక్టర్​కు ఇవ్వడంపై తహసీల్దార్లు మండిపడుతున్నారు. అసలు తమ అధికారాలను ఎలా తీసుకుంటారని వాపోయారు. దీంతో భూసమస్యలు అనేవి పేరుకుపోతున్నాయని తెలిపారు.

Collectors copied MROS digital signatures: తహసీల్దార్ల సంతకాలను(డిజిటల్‌) జిల్లా కలెక్టర్లు పెట్టేస్తున్నారు. కొత్త రెవెన్యూ, ధరణి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం యాజమాన్య హక్కులు కల్పించే అధికారాన్ని తహసీల్దార్ల నుంచి తొలగించింది. ఆ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. దీంతో యాజమాన్య హక్కు పత్రాలపై తహసీల్దార్ల సంతకం కలెక్టరేట్ల ద్వారా వస్తోంది. తమ అంగీకారం లేకుండానే కలెక్టర్‌ ఆమోదంతో సంతకం రావడంపై తహసీల్దార్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ విధానం సరికాదని, వెంటనే సవరించాలని పట్టుపడుతున్నారు. తమ ఆమోదం లేకుండానే ఎక్కడైనా వివాదాస్పద భూదస్త్రాలపై తమ సంతకం పడితే భవిష్యత్‌లో ఏర్పడే వివాదాలకు బాధ్యులం కావాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో కొత్తగా జారీ అవుతున్న పాసుపుస్తకాలపై తహసీల్దారు డిజిటల్‌ సంతకం ఉంటోంది. కానీ, వాటిని వారు నేరుగా ఆమోదించడం లేదు. అయినా వారి సంతకం ముద్రితమవుతోంది. ఎవరైనా రైతులు తమకు పాసుపుస్తకాలు అందలేదనో లేదా యాజమాన్య హక్కులు రాలేదనో, భూ దస్త్రాల్లోని తప్పులను సవరించాలనో విన్నవించుకోవాలంటే నేరుగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసుకునే విధానాన్ని రెండేళ్ల నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. మీసేవ, ధరణి పోర్టల్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారు తహసీల్దారుకు ఆ దస్త్రాన్ని పంపుతున్నారు.

మండల కార్యాలయంలో ఆ దస్త్రాలను పరిశీలించి కలెక్టరేట్‌కు తిరిగి పంపిన తరువాత ధరణి పోర్టల్లోని లాగిన్‌లో పాసుపుస్తకం జారీకి సంబంధించిన ఐచ్ఛికానికి కలెక్టర్‌ ఆమోదం తెలుపుతున్నారు. దీంతో దస్త్రాలపై ఆ మండల తహసీల్దారు సంతకం(డిజిటల్‌) వస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిషేధిత జాబితాలోని భూముల తొలగింపు, పలు ఇతర భూములకు సంబంధించిన యాజమాన్య హక్కుల ఆమోదానికి సంబంధించి కలెక్టరేట్లలోనే నిర్ణయాలు జరిగిపోతున్నాయని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల తహసీల్దార్ల సంతకం దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోర్టల్‌ బయట ఉన్న భూములకు సంబంధించి హక్కులు కల్పించే సమయంలో తహసీల్దార్ల సంతకం అవసరమవుతోంది. అలాంటి సందర్భాల్లో కలెక్టర్లు తహసీల్దార్ల సంతకాన్ని ఆమోదిస్తున్నారు.

"దస్త్రాలపై కలెక్టర్ల ఆమోదంతో తహసీల్దార్ల డిజిటల్‌ సంతకం వస్తోంది. ఏవైనా న్యాయ వివాదాలు ఏర్పడితే తహసీల్దార్లు బాధ్యత వహించాల్సి వస్తుంది. తహసీల్దార్లకు తెలియకుండా సంతకం రావడం సరికాదు. భూయాజమాన్య హక్కుల సమస్యలను పరిష్కరించే అవకాశం తహసీల్దార్లకు కల్పిస్తే రైతులకు సులువుగా హక్కులు దక్కుతాయి". -వంగ రవీందర్‌రెడ్డి, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు

యాజమాన్య హక్కుల కోసం రైతుల ప్రదక్షిణలు.. తెలంగాణ రాష్ట్రంలో 74 లక్షల భూఖాతాలున్నాయి. వాటిలో దాదాపు 61.31 లక్షల ఖాతాలనే వ్యవసాయ ఖాతాలుగా పరిగణిస్తూ రెవెన్యూశాఖ పాసుపుస్తకాలు జారీచేసింది. 11 లక్షల ఎకరాలకు సంబంధించి యాజమాన్య హక్కుల జారీ ప్రక్రియ నిలిచిపోయి ఉంది. వాటి పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకు రెవెన్యూశాఖ అప్పగించింది. రైతులు మీసేవా, ధరణి ద్వారా కలెక్టర్‌లకు దరఖాస్తు చేస్తున్నారు. అక్కడి నుంచి దస్త్రం తహసీల్దార్లకు చేరుతోంది. వారు పరిశీలించిన అనంతరం కలెక్టరేట్‌లకు వెళ్తున్నా చాలాసార్లు తిరస్కారానికి గురవుతున్నాయి. చిన్న చిన్న సందేహాలున్నా తిరస్కరిస్తున్నారు. రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇలా చాలామంది రైతులు రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. సుమారు 3.5 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని ప్రజాసంఘాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.