ETV Bharat / city

'అర్హులకు పథకాలు అందకపోతే.. పరిహారమివ్వాల్సిందే..!'

author img

By

Published : Jun 9, 2020, 4:35 PM IST

Updated : Jun 9, 2020, 5:40 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు నిర్దిష్ట కాలపరిమితిలో అర్హులందరికీ అందేలా చూడాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. ఇసుక, ఉపాధి హామీ, వ్యవసాయం, నాడు - నేడు, కరోనా నివారణ చర్యలు, మద్య నియంత్రణ వంటి అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఇసుక, మద్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

'స్పందించకుంటే పరిహారం.. అర్హులకు అందాలి పథకం ఫలితం'
'స్పందించకుంటే పరిహారం.. అర్హులకు అందాలి పథకం ఫలితం'

రాష్ట్రంలో నిర్దిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలు అందకపోతే పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్​ ప్రకటించారు. స్పందన కార్యక్రమం, వివిధ అంశాలపై ఆయన.. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలినాని, సురేశ్‌, సీఎస్‌, డీజీపీ పాల్గొన్నారు. కొత్త లబ్ధిదారులతో కలిపి 30.3 లక్షల మందికి జులై 8న ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించిన జగన్​.. వారికి బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలన్నారు.

3 లక్షల టన్నుల ఉత్తత్తే లక్ష్యం

రోజుకు 3 లక్షల టన్నులు ఇసుక ఉత్పత్తి చేసేలా రీచ్‌లు తెరవాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. ఇసుక, మద్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. వర్షాలు వచ్చేనాటికి 70 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయాలని నిర్దేశించారు. ఈ నెలాఖరు కల్లా రోజుకు 3 లక్షల టన్నుల ఉత్తత్తి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.

శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో.. కొత్త సోర్స్‌లు కూడా గుర్తించి అక్కడ రీచ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేపట్టాలన్న సీఎం.. గ్రామస్థులు పక్కనున్న రీచ్‌ల నుంచి ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు.

60 లక్షల మందికి పని కల్పించాలి

ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే సమీక్షా సమావేశం నాటికి 60 లక్షల మందికి పని కల్పించాలని సీఎం జగన్​ అధికారులకు నిర్దేశించారు. ప్రస్తుతం 54.5 లక్షల మంది ఉపాధి పనులకు వస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ - క్రాప్​ విధానం కీలకం

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర పొందేందుకు ఈ - క్రాప్​ బుకింగ్​ విధానం చాలా కీలకమని సీఎం తెలిపారు. ఇది​ 100 శాతం కచ్చితత్వంతో జరగాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీన్ని వ్యవసాయ, రెవెన్యూ అసిస్టెంట్‌ చేయించాలని సూచించారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఈ – క్రాప్‌ బుకింగ్‌ పునాదన్న ఆయన.. ప్రకృతి వైపరీత్యాలు, పంట రుణాలు, బీమాకు ఈ విధానం వల్ల ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు.

కరోనా కట్టడిలో పనితీరు భేష్​

కరోనా నివారణ చర్యల్లో కలెక్టర్లు చాలా బాగా పనిచేశారని ముఖ్యమంత్రి అభినందించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, నర్సులు, వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. కొవిడ్‌తో కలిసి ఎలా బతకాలన్నదే ఇప్పుడు మనం ఆలోచించాలన్న ఆయన.. అనుమానం ఉన్నవారు పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఇంట్లోనే మందులు తీసుకుంటే 85 శాతం కేసులు తగ్గిపోతాయన్న జగన్​.. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.

కొత్త వైద్యకళాశాలలకు శ్రీకారం

స్కూళ్లలో నాడు - నేడు కార్యక్రమాలను జేసీలు నిత్యం పర్యవేక్షించాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 15 కొత్త వైద్య కళాశాలలకు స్థలాలు మంజూరు చేయాల్సి ఉందన్న ఆయన.. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని నిర్దేశించారు. ఒక్కో వైద్యకళాశాలకు కనీసం 50 ఎకరాలు గుర్తించాలని అన్నారు.

మద్యాన్ని నియంత్రించండి

రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఎం జగన్​ స్పష్టం చేశారు.43 వేల బెల్టుషాపులు ఎత్తేసి.. 33 శాతం దుకాణాలు తగ్గించామని అన్నారు. మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి..

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: చంద్రబాబు

Last Updated : Jun 9, 2020, 5:40 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.